

జనం న్యూస్ 09 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకను జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో మహిళా పోలీసు స్టేషను ప్రాంగణంలో మార్చి 8న ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ముఖ్య అతిధిగా అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – మహిళలను గౌరవించడమనేది అంతర్జాతీయ
మహిళా దినోత్సవం రోజున మాత్రమే ఇచ్చే ప్రక్రియ కాదని, ప్రతీ రోజూ మహిళలను గౌరవించడం మనందరి బాధ్యత అని అన్నారు. మహిళలకు సమాన హక్కులు కల్పించడం, వారి అభివృద్ధికి ఎటువంటి చర్యలు చేపట్టాలన్న అంశాలను పునఃపరిశీలించేందుకు, చర్చించేందుకు మహిళాదినోత్సవంను ప్రతీ ఏడాది నిర్వహిస్తున్నామన్నారు. నేడు మహిళలు ఎన్నో రంగాల్లో రాణిస్తూ, తమ విధులను సమర్ధవంతంగా నిర్వహిస్తూ, పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. పోలీసుశాఖలో కూడా మహిళా ఉద్యోగులు సంఖ్య ప్రతీ ఏడాది పెరుగుతూ వస్తుందని, వివిధ ర్యాంకుల్లో మహిళలు పోలీసు విధులను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారన్నారు. రాజకీయాల్లో కూడా మహిళలు రాణిస్తున్నారన్నారు.రాష్ట్ర హెూంశాఖ మంత్రిగా వంగలపూడి అనిత గారు మంచి నాయకత్వ లక్షణాలతో పోలీసుశాఖను సమర్ధవంతంగా
రాణిస్తున్నారన్నారు. మన కుటుంబంలో ఉండే పిల్లల్లోనే ముందుగా లింగ వివక్షకు స్వస్తి పలకాలన్నారు. అలాంటప్పుడే సొసైటీలో కూడా అమ్మాయి, అబ్బాయి అన్న వివక్ష లేకుండా ఉంటుందన్నారు. మహిళలు ఇంటి నుండి బయటకు వచ్చినపుడు తాము పని చేసే, చదువుకొనే ప్రాంతాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవ్వవచ్చునన్నారు. వీటిని మౌనంగా భరించాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. కష్ట సమయాల్లో వారికి పోలీసులు అండగా నిలుస్తారని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. గతంలో కంటే మహిళలు ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు తక్షణమే చర్యలు చేపట్టడమే కాకుండా, నిందితులకు శిక్షలు కూడా త్వరితగతిన పడే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా ఇటీవల నమోదైన పోక్సో కేసుల్లో మూడింటిలో మూడు, ఆరు మాసాల్లోనే నిందితులు శిక్షింపబడే విధంగా చర్యలు చేపట్టి, మహిళల రక్షణకు భరోసాను కల్పిస్తున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. తిరుమల-మెడికవర్ వైద్యులు డా. ఐ.కృష్ణశాంతి మాట్లాడుతూ – మహిళలు రాణించాలంటే సమస్యను అర్ధం చేసుకొని సవాళ్ళను ఎదుర్కొనేందుకు ధైర్యంగా ముందుకు అడుగు వేయాలన్నారు. మహిళలు ఆరోగ్య విషయంపై కూడా దృష్టి పెట్టాలని, అందుకు అనుగుణంగా డైట్, వైద్య పరీక్షలు, చికిత్సను తీసుకోవాలని మహిళలకు సూచించారు. రాజాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ స్వప్న హైందవి మాట్లాడుతూ – కుటుంబంలో భర్త, భార్య అన్న తారతమ్యం లేదని, ఇరువురు సఖ్యతగా ముందుకు వెళ్ళితేనే కుటుంబం ఉన్నతంగా ఉంటుందన్నారు. అదనపు ఎస్పీ పి.సౌమ్యలత సభకు అధ్యక్షత వహించి మహిళలకు ఏ పనైనా చేసేందుకు అర్హత ఉంది, అవకాశం ఇవ్వండి అని అడిగే విధంగా మహిళలు తమ నైపుణ్యాలను మెరుగుపర్చు కోవాలన్నారు. అనంతరం, వివిధ రంగాలకు చెందిన మహిళలు, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు మహిళా పోలీసు స్టేషను నుండి ఆర్ అండ్ బి జంక్షను వరకు ర్యాలీని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ప్రారంభించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ర్యాలీలో మహిళలు ప్లకార్డులు ప్రదర్శించి, నినాదాలు చేసారు. ఆర్ అండ్ బి జంక్షనులో పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు ఫ్లాష్ మాబ్ నిర్వహించి, మహిళలను ఉత్సాహపర్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డా.కృష్ణశాంతి, డా.స్వప్న హైందవి, విజయనగరం డిఎస్సీ ఎం.శ్రీనివాసరావు, బొబ్బిలి డిఎస్పీ జి.భవ్య రెడ్డి, వివిధ రంగాలకు చెందిన మహిళలు, మహిళా పోలీసు అధికారులు, సిబ్బంది, మహిళా సంరక్షణ పోలీసులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.