

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 12 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెనుమత్స దుర్గాభవాని మహిళలు సామాజికంగా, అర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాలి మాజీ ఎమ్మెల్యే కందిమళ్ల జయమ్మ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా దినోత్సవం స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెనుమత్స దుర్గాభవాని విమర్శించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మహిళా సమాఖ్య ఏరియా సమితి ఆధ్వర్యంలో సీపిఐ కార్యాలయలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పాలకుల మాటల్లోనే మహిళా సాధికారత ఉందని, చేతల్లో లేదని విమర్శించారు. శ్రామిక మహిళల పోరాట స్ఫూర్తి క్రమంగా కనుమరుగు అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా దినోత్సవం ఓటు బ్యాంకు రాజకీయాలకు వేదికగా మారిపోతోందని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో మహిళల ఓట్ల కోసం కురిపించిన హామీలు ఒక్కటి కూడా అమలు కావడం లేదని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం హామీలే ఇందుకు నిదర్శనమన్నారు. రాజ్యాంగం అందించిన సమానత్వం ఏళ్లు గడిచినా సాధ్యం కాలేదని, నిత్యం మహిళా సమాజంపై దాడులు పెరుగుతున్నా పాలకులకు పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ పాలనలో మహిళా సమాజం మరో వంద ఏళ్లు వెనక్కి వెళ్లిపోతోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మహిళా దినోత్సవం అందించిన పోరాట స్ఫూర్తితో మహిళలు మరింత చైతన్యవంతంగా ఉద్యమాల వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. మహిళలు సామాజికంగా, అర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాలని ఒయాసిస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కందిమళ్ల జయమ్మ అన్నారు. సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలకు పూర్తి హక్కులు, స్వేచ్ఛ, రక్షణలను ప్రభుత్వాలు ఇంకా కల్పించలేకపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు చైతన్యవంతులు కావాలని అప్పుడే హక్కులు సాధించుకుంటారన్నారు. సభకు అధ్యక్షత వహించిన మహిళా సమాఖ్య ఏరియా కార్యదర్శి చెరుకుపల్లి నిర్మల మాట్లాడుతూ భారతదేశంలో మహిళలకు మనువాదం కాదు అందరివాదం కావాలి అని స్పష్టం చేశారు. మహిళలు ఎక్కడ అన్యాయానికి గురైనా అక్కడ మహిళా సమాఖ్య ముందుంటుందని, న్యాయం కోసం పోరాటం చేస్తుందని తెలిపారు. మహిళలంతా ఐక్యంగా మహిళా సమాఖ్యను బలోపేతం చేయాలని సూచించారు.లౌకిక ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకు మహిళలు నడుం బిగించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎ మారుతీ వరప్రసాద్, ఏరియా ఇన్చార్జి కార్యదర్శి తాళ్లూరి బాబురావు,ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ సుబాని, మహిళా సమాఖ్య నాయకురాలు దుర్గ, ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి దాసరి వరహాలు, నాయకులు కె మల్లిఖార్జునరావు, చౌటుపల్లి నాగేశ్వరరావు, బొంత నాగయ్య, అంజయ్య, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు.