Listen to this article

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 13 జనవరి
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం జిల్లాలో కోడి పందాలు, పేకాటలు, గుండాటలు వంటి ఇతర జూద క్రీడలు నిర్వహిస్తే, వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జనవరి 12న హెచ్చరించారు.సంక్రాంతి పండగ పేరుతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే, వారిపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. జిల్లాలో కోడి పందాలు, పేకాటలు నిర్వహిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని, గతంలో పేకాట, కోడి పందాలతో ప్రమేయం ఉన్న 109 వ్యక్తులను ఇప్పటికే గుర్తించి, వారిని మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ వారి వద్ద మంచి ప్రవర్తనకు బైండోవరు చేసామన్నారు. కోడి పందాలను నియంత్రించేందుకు హైకోర్టు ఆదేశాలతో మండల స్థాయిలో రెవెన్యూ, స్థానిక పోలీసులు మరియు జంతు సంరక్షణ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేసామన్నారు. క్షేత్ర స్థాయిలో కోడి పందాలు నిర్వహణపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ జాయింట్ కమిటీలు నిఘాపెట్టాయన్నారు. ఈ జాయింట్ కమిటీలు క్షేత్ర స్థాయిలో గ్రామస్థులతో సమావేశాలు నిర్వహించి, సంక్రాంతి పండగను సంప్రదాయ పద్దతిలో నిర్వహించుకోవాలని, ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలను చేపట్టవద్దని, వాటిలోభాగస్వాములు కావద్దని, పోలీసుశాఖకు సహకరించాలని కోరుతున్నామన్నారు. కోడిపందాలు, పేకాటలు నిర్వహించడం,బెట్టింగులకు పాల్పడడం చట్టరీత్యా నేరమని, వాటికి దూరంగా ఉండాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా, ప్రోత్సహించినా ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఇందుకుగాను కోడి పందాలు నిర్వహించే వారిపైనా, కోడి కత్తులను తయారు చేసే వారిపైనా, కోడిపుంజులకు కత్తులు కట్టిన వారిపైనా నిఘా పెట్టామన్నారు. క్షేత్ర స్థాయిలో కోడి పందాలు నిర్వహించే ప్రాంతాలను డ్రోన్స్ తో పర్యవేక్షిస్తామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్తెలిపారు.పండగలకు స్వంత గ్రామాలకు వెళ్ళే ప్రజలు ప్లే స్టోర్ నుండి ఎల్.హెచ్.ఎం.ఎస్. మొబైల్ యాప్ ను డౌన్లోడు చేసుకొని, ఎల్.హెచ్.ఎం.ఎస్. సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సౌకర్యం అందుబాటులో లేని ప్రాంత ప్రజలుతమ ఇండ్లపై పోలీసులు నిఘా పెట్టే విధంగా స్థానిక పోలీసులకు సమాచారాన్ని అందించాలన్నారు. ఇండ్లలో విలువైనవస్తువులను ఉంచవద్దని, సాధ్యమైనంత వరకు వాటిని తమతో తీసుకొని వెళ్ళడం లేదా బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవాలని ప్రజలను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ కోరారు.