

విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి తాడువాయి తండాలో ప్రాథమిక పాఠశాలను సందర్శించిన మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు జనం న్యూస్ మార్చి 20(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) ప్రాథమిక విద్యా దశలోనే విద్యార్థులకు తగిన మేధా సామర్థ్యం మెరుగుపడుతుందని మండల విద్యాధికారి పిడతల వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం మునగాల మండల పరిధిలోని తాడువాయి తండాలో ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రాథమిక దశలోనే విద్యార్థికి దృశ్య,శ్రవణ జ్ఞానం చేకూరి వారి సామర్థ్యాలు మెరుగుపడతాయి అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని,విద్యార్థుల సంఖ్య పెరగాలంటే విద్యా బోధనలో మార్పు రావాలన్నారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠ్యాంశాలను బోధించాలన్నారు. విద్యార్థులు చదువుతున్న తీరును ఒక్కొక్క విద్యార్థిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం నాణ్యతతో ఉండాలని భోజన ఏజెన్సీ వారికి సూచించారు. అనంతరం పాఠశాల పరిసరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నెమ్మాది ఉపేందర్, ఉపాధ్యాయురాలు అమరగాని సరిత పాల్గొన్నారు.