

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 01 ఏప్రిల్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
జిల్లాలో రంజాన్ పండగ హిందూ – ముస్లిం సోదరుల మధ్య సోదర భావం పెల్లుబికి, పండగలో ఎటువంటి మత విద్వేషాలు, సంఘర్షలు, అల్లర్లు జరగకుండా రంజాన్ పండగ ప్రశాంతయుతంగా ముగిసినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మార్చి 31న తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – జిల్లాలో రంజాన్ పర్వదినాన జిల్లాలో ఎటువంటి మత ఘర్షణలు తలెత్తకుండా జిల్లా పోలీసుశాఖ చేపట్టిన ముందస్తు భద్రత చర్యలు సత్ఫలితాలిచ్చాయని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. రంజాన్ పర్వదినాన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లా వ్యాప్తంగా అన్ని మసీదుల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు, భద్రత ఏర్పాట్లును సంబంధిత పోలీసు అధికారులు డ్రోన్స్ తో పర్యవేక్షించారన్నారు. మసీదుల వద్ద ప్రార్ధనలకు విచ్చేసిన ముస్లిం సోదరులకు హిందూ సోదరులు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ, మత
సామరస్యానికి ప్రతీకగా నిలిచారన్నారు. కొన్ని మసీదుల వద్ద హిందువులు, ముస్లింలు సోదర భావంతో ఒకరినొకరు అలింగనం చేసుకొని, శుభాకాంక్షలు తెలుపుకొన్నారన్నారు. పట్టణంలో ముఖ్యమైన మసీదుల వద్ద డ్రోన్స్ తో నిఘా ఏర్పాటు చేసి, ప్రార్ధనలకు వచ్చే ముస్లిం సోదరుల వాహనాల వలన ఎటువంటి ట్రాఫిక్కు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
భారత దేశం విభిన్న సంస్కృతుల సమ్మేళనమని, రంజాన్ పండగ రోజున హిందూ – ముస్లిం సోదరులు ఒకరి సంస్కృతిని ఒకరు గౌరవించుకొంటూ, శుభాకాంక్షలు తెలుపుకొంటూ మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారన్నారు. రంజాన్ ముస్లింల పవిత్రమైన మాసమని, ప్రతీ రోజూ ఉపవాస దీక్ష చేస్తూ, ప్రార్ధనలు చేస్తూ, ముస్లిం సోదరులు తమ దాతృత్వాన్ని చాటుకుంటారన్నారు. ఈ మాసంలో నిర్వహించే ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులు తమకు ఆప్తులైన హిందువులను ఆహ్వానించి, వారితో కలిసి భోజనం చేయడం పరస్పర ఐక్యతకు, సమాజంలో శాంతి, సహనం, ప్రేమకు నిదర్శనంగా నిలుస్తుందని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ మసీదుల వద్ద సంబంధిత పోలీసు అధికారులు, సిఐలు భద్రత విధులు నిర్వహించగా, విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, బొబ్బిలి డిఎస్పీ జి.భవ్యరెడ్డి, చీపురుపల్లి డిఎస్పీ ఎస్.రాఘవులు బందోబస్తు, భద్రత ఏర్పాట్లును పర్యవేక్షించారు.