

మారుతున్న వాతావరణం..
ఆందోళన చెందుతున్న రైతులు…
జనం న్యూస్ ఏప్రిల్ 03(నడిగూడెం)
ఇటీవల వాతావరణంలో చోటు చేసుకుంటున్నా విపరీత పరిణామాల కారణంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏ సమయంలో వర్షం కురుస్తుందో కూడా తెలియని పరిస్థితిలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాతావరణంలో ఏర్పడుతున్న మార్పులు కారణంగా ఒక్కసారిగా మబ్బులు పట్టడం, తిరిగి మామూలు వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సాగర్ ఆయకట్టు ప్రాంతమైన మండల పరిసర ప్రాంతాల్లో కొద్దిరోజులుగా వరి కోతలు ముమ్మ రంగా కొనసాగుతున్నాయి. రైతులు కోసిన ధాన్యాన్ని బహిరంగ ప్రదేశాల్లో ఆరబెట్టుకుంటున్నారు. ఒకసారిగా మబ్బులు పట్టడంతో రైతులు ధాన్యాన్ని రాసులు చేసుకుని పట్టాలు కప్పుకుంటున్నారు. తిరిగి ఎండ రాగానే ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నారు. గత సంవత్సరం వచ్చిన అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. వ్యాపారులు ధాన్యం తేమ ఉంటే సక్రమంగా కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మిల్లర్లు తేమ పేరుతో ధాన్యం ధరను తగ్గిస్తున్న నేపథ్యంలో రైతులు ధాన్యాన్ని అరబెట్టుకుంటున్నారు. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికి వచ్చినప్పటికీ అమ్ముకోవటానికి కూడా అనేక కష్టనష్టాలకు గురవుతున్నారు. ఒక్క సారిగా వాతావ రణంలో మార్పులు రావటం, వర్షం పడటం ఇటీవల అనేక ప్రాంతాల్లో చోటు చేసుకుంది. ధాన్యం దగ్గరకు తీసుకునే అవకాశం కూడా లేకుండా వర్షాలు పడుతున్నాయి. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.