Listen to this article

పలుమార్లు విన్నవించిన పట్టించుకోని అధికారులు

జనం న్యూస్,ఏప్రిల్ 04, కంగ్టి

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని డోంగ్ బాన్సువాడ గ్రామంలో మంచినీటి సమస్య తీవ్రమైంది. భూగర్భ జలాలు అడుగంటడంతో, త్రాగునీటి సమస్య తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామంలో ఉన్న రెండు బోర్లు చెడిపోయి 15 రోజులు గడుస్తున్న పట్టించుకోని పంచాయతీ అధికారులు. పలుమార్లు చెప్పినా సమస్య పరిష్కరించడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గ్రామ సమీపంలోని పంట పొలాల్లో నుంచి నీళ్లను తెచ్చుకోవాల్సిన పరిస్థితి దాపరించిందన్నారు. డోంగ్ బాన్సువాడలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్న,సమస్య తీవ్రంగా ఉండి మంచినీటి కోసం ప్రజలు అల్లాడుతుంటే, అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టకుండా కేవలం కార్యాలయాలకే పరిమితమై సమీక్షలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదని, అధికారులు చెప్పినప్పటికీ దానికి, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితికి పొంతన లేదని పలువురు విమర్శిస్తున్నారు.ఎక్కడ చూసినా తీవ్ర నీటి ఎద్దడితో త్రాగునీటి సమస్య తలెత్తినా అధికార యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెట్టినట్లు ఉన్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి,కనీసం ట్యాంకర్ల ద్వారా నీరందించినా కొంతలో కొంతైనా ఉపశమనం కలుగుతోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.ఇప్పటికైనా మంచినీళ్లు అందించండి మహోప్రభో అంటూ గ్రామ ప్రజలు కోరుతున్నారు.