Listen to this article

సన్న బియ్యం పంపిణీకి ప్రజల నుంచి సానుకూల స్పందన

పెద్ద కల్వల గ్రామంలో రేషన్ కార్డు లబ్ధిదారు నివాసంలో స్థానిక ఎమ్మెల్యేతో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్

జనం న్యూస్, ఏప్రిల్ 11,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి

పెద్దపల్లి జిల్లాలో ఏప్రిల్ మాసం 90 శాతం రేషన్ పంపిణీ పూర్తి చేశామని, ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పెద్దపల్లి మండలం లోని పెద్ద కల్వల గ్రామంలో తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులు రాజేశ్వరి రవి నివాసంలో ప్రభుత్వం ఇటీవలే పంపిణీ చేసిన సన్న బియ్యంతో స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు, అదనపు కలెక్టర్ డి. వేణు తో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాలతో తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, ఇక నుంచి రేషన్ లో సన్న బియ్యం మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుందని, ఈ సంతోష సమయంలో లబ్ధిదారుల తో కలిసి భోజనం చేశామని అన్నారు. పెద్దపల్లి జిల్లాలో 90 శాతం వరకు రేషన్ పంపిణీ పూర్తయిందని, సాధారణంగా ప్రతి నెల 15 నుంచి 20వ తారీఖు వరకు రేషన్ బియ్యం పంపిణీ కొనసాగుతోందని, ఈ నెల సన్న బియ్యం పంపిణీ చేయడంతో నాలుగో తారీఖు ప్రారంభిస్తే నాలుగు రోజులలో 90 శాతానికి పైగా పూర్తయిందని ,సన్న బియ్యం పంపిణీకి ప్రజల నుంచి మంచి స్పందన ఉందని అన్నారు.పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ, పెద్దపల్లి నియోజకవర్గం లో 55 రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం సరఫరా కార్యక్రమం విజయవంతంగా జరిగిందని అన్నారు. గతంలో ప్రజలకు రేషన్ ద్వారా దొడ్డు బియ్యం మాత్రమే సరఫరా చేశారని, దీని వల్ల చాలా వరకు రీసైక్లింగ్ జరిగేదని, నేడు సన్న బియ్యం ప్రజలు చాలా సంతోషంతో తీసుకుంటున్నారని ఎమ్మెల్యే తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 గ్యాస్ సిలిండర్ సరఫరా వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు.రైతులకు 2 లక్షల రుణ మాఫీ, సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ అందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి గంగయ్య, జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేందర్, డి.యం. శ్రీకాంత్ , డిప్యూటీ తాసిల్దార్ మహేష్ కుమార్, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.