

బిచ్కుంద ఏప్రిల్ 11 జనం న్యూస్ (జుక్కల్ కాని స్టేషన్ రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్)
బడుగు బలహీన వర్గాల ఆదర్శ ఆశ జ్యోతి మహిళల జీవితాల్లో విద్యా ప్రాముఖ్యతను సమాజానికి చాటి చెప్పిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే యొక్క 198వ జయంతి సందర్భంగా బిచ్కుంద మార్కెట్ కమిటీ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగాధర్ డెలికేట్ విట్టల్ రెడ్డి కలిసి జ్యోతిరావు పూలే యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు .ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు సీమ గంగారాం మాట్లాడుతూ 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలో జన్మించిన పూలే గారు బాల్యం నుంచి ఆనాటి సాంఘిక దురాచారాలు కట్టుబాట్లు మధ్య వారి జీవితం కొనసాగింది. విద్యాభ్యాసం లోను వివక్షను ఎదుర్కొన్నారు. అయితే ఆంగ్లో- స్కాటిష్ అనే క్రైస్తవ మిషనరీ పాఠశాలలో విద్య ప్రారంభించారు. అక్కడే సమానత్వం అనే భావనతో అనేక ఆలోచనలతో పరిపక్వత చెందుతూ చదువు కేవలం ధనికులకు, బ్రాహ్మణులకు మాత్రమే అన్న సమాజ బ్రాంతిని తొలగించాలని ఆశయం అక్కడ మొదలై విద్యను అణగారిన వర్గాల కు అందించాలని మానవతా సంకల్పం ఆయనను కదిలించింది. 1840లో సావిత్రిబాయి పూలేను వివాహమాడి స్త్రీలను విద్యావంతులను చేయడానికి భార్యకు చదువు చెప్పించి ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది 1848లో పూణేలో తొలి బాలిక పాఠశాల స్థాపించి విద్య అందరికీ అనే నినాదం కార్యరూపం దాల్చేలా చేసి, ఇది కేవలం విద్యా కేంద్రం కాదు సామాజిక మార్పు కేంద్రం అని సూచించారు. 1873లో “సత్యశోధక సమాజం” స్థాపించి దాని ద్వారా కుల వ్యవస్థను వ్యతిరేకించి శూద్ర అతి సూద్ర వర్గాలకు ఆత్మగౌరవాన్ని నూరిపోసి వివాహ పూజా విధులలో స్వతంత్రమైన ఆలోచనలను కలిగి ముందుకు సాగేలా చేశారు. వివక్షత మనిషిని మానవత్వం నుండి దూరం చేస్తుంది ఒకరి మానవత్వాన్ని చిన్నగా చూస్తే అది సమాజానికి శాపంగా పరిణమిస్తుందని పూలే యొక్క అభిప్రాయం. జ్యోతిరావు పూలే రాసిన “గులాం గిరి” అనే పుస్తకంలో అత్యంత దయనీయంగా బానిసత్వంలో మగ్గుతున్న కులాల పరిస్థితులను దాస్యత్వాన్ని విశదీకరించారు. బానిసత్వాన్ని రూపుమాపడానికి అలాగే విద్య ఆర్థిక రాజకీయ సమానత్వం కోసం పరిష్కార మార్గాలు చూపారు. పూలే తన జీవితాంతం తాత్వికుడుగా సంఘసంస్కర్తగా అట్టడుగు వర్గాల ఆత్మబంధువుగా పోరాటాలు చేస్తూ సమసమాజ అభివృద్ధికి ఆజన్మాంతం సేవలందించారు .ఆ మహనీయుని యొక్క సేవలను స్మరించుకుంటూ భవిష్యత్తు తరాల వారికి పూ లే యొక్క జీవిత చరిత్ర ఆదర్శప్రాయంగా తీసుకొని నడిచేలా చేయాలి. మున్ముందు మహాత్మ జ్యోతిరావు పూలే యొక్క సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ఇవ్వాలి అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా అన్నిచోట్ల పూలే యొక్క జయంతి వేడుకలను నిర్వహించేలా ప్రోత్సహించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పటేల్, సిఐటియు సభ్యుడు సురేష్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాయిని అశోక్ గుండె కల్లూరు మాజీ ఎంపీటీసీ రాజు పటేల్ , తదితరులు పాల్గొన్నారు
