

జనం న్యూస్ ఏప్రిల్ 14(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ )
సబ్జెక్టు-డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న మహారాష్ట్రకు చెందిన మెహర్ కులంలో రామ్‌జీ మాలోజీ సక్పాల్, భీమాబాయ్ రామ్‌జీ సక్పాల్ దంపతులకు ఆఖరి సంతానంగా జన్మించారు. ఆయన తండ్రి రామ్‌జీ మాలోజీ సక్పాల్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సుబేదార్‌గా పనిచేసేవారు. అంబేద్కర్‌కు రెండేళ్ల వయస్సు ఉన్నప్పుడు ఆయన ఆర్మీ నుంచి పదవీ విమరణ పొందారు. ఆయనకు ఆరేళ్ల వయస్సప్పుడు తల్లి భీమాబాయ్ మరణించారు. సతారాలో ఆయన పాఠశాల విద్య ప్రారంభమైంది. చిన్న వయసులోనే తల్లి మరణించడంతో పినతల్లి ఆయన బాగోగులు చూసింది.పాఠశాల విద్య కొనసాగుతుండగానే కుటుంబం బాంబేకు తరలివెళ్లడంతో అంబేద్కర్ మిగతా పాఠశాల విద్య అంతటిని బాంబేలో పూర్తిచేశారు. అయితే, పాఠశాల విద్య కొనసాగినన్ని రోజులు తీవ్ర కుల వివక్షను ఎదుర్కొన్నారు. అంటరాని తనంతో విసిగిపోయారు. ఆ తర్వాత వివిధ దేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించారు. అయితే, చిన్న వయసులో మనసుకు తగిలిన గాయాలు ఆయనను జీవితాంతం అంటరానితనాన్ని, సమాజంలో అసమానతలను రూపుమాపేందుకు పోరాడేలా చేశాయి. ఈ పోరాటంలో ఆయన చాలా వరకు విజయం సాధించారు. చిన్న వయస్సులో అవమానాలు భరించినా పెరిగి పెద్దవాడయ్యాక తన ప్రతిభను చాటుకుని సమాజంలో ఒక మహోన్నత మూర్తిగా నిలిచారు.అయితే, మరణానికి కొన్ని రోజుల ముందు 1956 అక్టోబర్‌లో అంబేద్కర్ బౌద్ధమతాన్ని స్వీకరించారు. హిందూమతంలో జన్మించిన అంబేద్కర్ కుల వివక్షకు వ్యతిరేకంగా మతం మారాలన్న నిర్ణయం తీసుకున్న తర్వాత బౌద్ధమతాన్ని స్వీకరించడానికి 20 ఏళ్లు పట్టింది. అప్పట్లో అందరినీ సమానంగా చూసిన ఏకైక మతం బౌద్ధమే కావడంతో ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు. అయితే, జీవితాంతం విశ్రాంతి లేకుండా దేశం కోసం, దేశ ప్రజల కోసం సేవచేసిన అంబేద్కర్ 1956 డిసెంబర్ 6న నిద్రలోనే కన్నుమూశారు. కాగా, అంబేద్కర్ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రతి ఏడాది ఏప్రిల్ 14న ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. దేశంలోనే గాక, ఇతర దేశాల్లో కూడా అంబేద్కర్ జయంతి వేడుకలు జరుగుతాయి. పుష్పాంజలి ఘటించడం, క్యాండిల్స్ వెలిగించడం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆ మహనీయుడికి జనం నివాళులు అర్పిస్తారు.