Listen to this article

ఏప్రిల్ 17 నుంచి ఏప్రిల్ 30 వరకు భూ భారతి అవగాహన కార్యక్రమాల నిర్వహణ

భూ భారతి అవగాహన కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలి

భూ భారతి చట్టం అమలు పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్

జనం న్యూస్, ఏప్రిల్ 16, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి

తెలంగాణ ప్రజలకు ఉన్న భూ సమస్యల పరిష్కారం కోసం ప్రజా ప్రభుత్వం నూతనంగా తీసుకుని వచ్చిన భూ భారతి ఆర్వోఆర్ చట్టం పై విస్తృతంగా ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష భూ భారతి చట్టం అమలు పై అదనపు కలెక్టర్ డి.వేణు తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, సిఎం ప్రజావాణి దరఖాస్తులను ఇంకా నుంచి ప్రతి వారం స్క్రూటినీ చేయడం జరుగుతుందని, వాటి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. భూ భారతి చట్టం పై తహసిల్దారులు రెవెన్యూ అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. భూ భారతి చట్టం యొక్క గెజిట్, రూల్స్ ను రెవెన్యూ శాఖ లో ప్రతి అధికారి తెలుసుకోవాలని అన్నారు. భూ భారతి చట్టంలో రెండంచెల అప్పీల్ వ్యవస్థ ఉందని అన్నారు. భూ పరిధి చట్టం ప్రకారం ఇకపై రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ చేసే సమయంలో సర్వే మ్యాప్ తప్పనిసరి అవుతుందని అన్నారు. ఏప్రిల్ 17 నుంచి ఏప్రిల్ 30 వరకు నూతన భూ భారతి ఆర్వోఆర్ చట్టం పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, దీనికి సంబంధించిన షెడ్యూలు, వెన్యూ లను తయారు చేసుకోవాలని అన్నారు .ప్రతి రోజు కనీసం 2 అవగాహన కార్యక్రమాలు జరగాలని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతులు , ఇతర ప్రజలు ఈ సమావేశాలకు హాజరయ్యేలా చూడాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. భూ భారతి చట్టం ముందస్తుగా రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద ప్రారంభించి, అక్కడ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి వాటిని పరిష్కరించి జూన్ నెలలో పట్టాలు పంపిణీ చేసి రాష్ట్రవ్యాప్తంగా అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.మన పెద్దపల్లి జిల్లాలో భూ భారతి చట్టం అమలుకు అధికారులు సన్నద్ధం కావాలని, ప్రజల భూ సమస్యల పరిష్కారానికి పటిష్ట కార్యాచరణ రూపొందించాలని అన్నారు. ప్రస్తుతం మన వద్ద పెండింగ్ ఉన్న ధరణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అన్నారు.ప్రభుత్వ భూముల ఫెన్సింగ్, మార్కింగ్ ప్రక్రియను తహసిల్దార్ లు పూర్తి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ డివిజన్ అధికారులు బి.గంగయ్య, సురేష్, తహ‌సిల్దార్ లు, సంబంధిత ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.