

మే 20, న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేద్దాం
సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు వెలిశాల క్రిష్ణమాచారి
జనం న్యూస్ మే 12 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలో మండల ఆఫీసు ఎదుట సిఐటియు మండల కన్వీనర్ మోర్లే నగేష్ అద్యక్షతన సిఐటియు మండల కమిటి సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం సమ్మె పోస్టర్లు విడుదల చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు వెలిశాల క్రిష్ణమాచారి మాట్లాడుతూ బీజేపీ నాయకత్వంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కార్మిక వర్గం రైతాంగం, ఉపాధిహామీ పథకం, సంఘటిత అసంఘటిత కార్మికులు పెద్ద ఎత్తున సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గ హక్కులు కాలరాస్తుందని, వ్యవసాయ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టిందని, ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి పేదల పొట్టలు కొడుతుందని వారు విమర్శించారు. ధరలు నిరుద్యోగం ఎన్నడూ లేనంతగా పెరిగి ప్రజల కొనుగోలు శక్తి తీవ్రంగా పడిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మోడీ ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం పడ్డట్లు ఉందని విమర్శించారు.దేశంలో 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ప్రజల రెక్కల కష్టంతో పెరిగి పెద్దదైన ప్రభుత్వ రంగ సంస్థలని, గనులు భూములు ఓడరేవులు స్వదేశీ విదేశీ సహజ వనరులన్నిటిని బడా పెట్టుబడుదారులకు కారు చౌకగా అమ్ముతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మతం పేరుతో ప్రజల మధ్య విద్వేష రాజకీయాలు చేస్తూ సమస్యలను పక్కదోవ పట్టిస్తూ కాలం గడుపుతుందని ఎద్దేవ చేశారు. ఈ విధానాలను ప్రతిఘటించడం కోసమే కార్మిక వర్గం రైతాంగం 145 కోట్ల ప్రజల ప్రయోజనాల కోసం జరుగుతున్న ఈ పోరాటంలో రైతాంగం కార్మిక వర్గం ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామ పంచాయితీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు జాడే మోరేశ్వర్ మరియు సీఐటీయూ మండల కమిటి సభ్యులు పిట్టల రవి, గ్రామ పంచాయితీ మండల అధ్యక్షుడు ఇప్ప ప్రకాశ్, ఉపాధిహామీ పథకం కార్మికుల యూనియన్ మండల అధ్యక్షుడు అశోక్ తదితరులు పాల్గొన్నారు.