

జనం న్యూస్ మే 28(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ మాదకద్రవ్యాల వైపు ఆలోచన వస్తే మన తల్లిదండ్రులను గుర్తు చేసుకోవాలని మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ..సమాజంలో యువత మంచి, చెడు తెలుసుకొని క్రమ శిక్షణతో మెలగాలని,అప్పుడే నిర్ధేశించుకున్న లక్ష్యాన్ని సాధించి గొప్ప స్థానానికి చేరుకునే అవకాశం లభిస్తుందని అన్నారు. యువత చెడు అలవాట్ల వైపు ఆకర్షితులైతే వచ్చే నష్టాలు, కుటుంబంలో మన తల్లిదండ్రులు,మన కుటుంబీకులు పొందే దుఃఖం వివరిస్తూ చెడు అలవాట్లకు మొదటి నుంచే దూరంగా ఉండాలని తెలిపారు.నేటి యువత రేపటి భావి భారత పౌరులని,డ్రగ్స్‌కు ఆకర్షితులైతే దేశ భవిష్యత్తు నాశనం అవుతుందని,దీనిని గుర్తించి డ్రగ్స్ వల్ల కలిగే విపరీత పరిణామాలపై అవగాహన పెంచుకొని దూరంగా ఉండాలని ఎస్సై సూచించారు.సమాజంలో పెరుగుతున్న సాంకేతికత కారణంగా చిన్న పిల్లలు సెల్ ఫోన్ వాడకం పెరగడం వల్ల ఆలోచనా విధానం మారిపోతుందని,దీని వల్ల అనేక నష్టాలు వస్తున్నాయని అన్నారు. ఒక పరిణతి వచ్చే వరకు సెల్ ఫోన్ ఇవ్వకపోవడం మంచిదని, ప్రతి ఇంట్లో పిల్లల ఫోన్ వాడకంపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలని సూచించారు.