Listen to this article

రాష్ట్ర హోం మరియ విపత్తుల నిర్వహణ3 మంత్రివర్యులు వంగలపూడి అనిత

జనం న్యూస్ 04 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

మహిళలపై జరిగే దాడుల్లో నమోదైన కేసుల్లో నిందితులను శిక్షించడంలో రాష్ట్రంలోనే విజయనగరం జిల్లా
ప్రధమ స్థానంలో నిలిచిందని రాష్ట్ర హెూం మరియు విపత్తుల నిర్వహణ మంత్రివర్యులు వంగలపూడి అనిత జూలై 3న అన్నారు. శక్తి మొబైల్ యాప్ లో ఉండే “ఎస్.ఓ.ఎస్.” మరియు “సేఫ్ ట్రావెల్ ‘ ఆప్షన్స్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో యువత సహకారంతో రూపొందించిన షార్ట్ ఫిల్మ్ ను, గోడ పత్రికను రాష్ట్ర మంత్రి మరియు జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు వంగలపూడి అనిత ఆవిష్కరించారు. జిల్లా కలెక్టరు వారి కార్యాలయంలో నిర్వహించిన “స్వర్ణాంధ్ర @2047″ సమీక్షా సమవేశంలో పాల్గొనేందుకు విచ్చేసిన రాష్ట్ర హెూం మరియు విపత్తుల నిర్వహణ మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ – మహిళలపై జరిగే దాడుల కారణంగా నమోదైన కేసుల్లో నిందితులు న్యాయస్థానాల్లో శిక్షింపబడే విధంగా చేయడంలో రాష్ట్రంలో విజయనగరం జిల్లానే ప్రధమ స్థానంలో నిలిచిందన్నారు. జిల్లా ఎస్పీ మరియు ఇతర పోలీసు అధికారులు మహిళల భద్రతకు చేపడుతున్న చర్యలు ఫలితంగానే ఇది సాధ్యమైందని జిల్లా పోలీసుల పనితీరును ప్రశంసిస్తూ, జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ను అభినందించారు. మహిళల భద్రతకు రాష్ట్రంలో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపడుతున్నామన్నారు. రాష్ట్ర విజనరీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో రాష్ట్ర పోలీసుశాఖ శక్తి యాప్ ను రూపొందించిందన్నారు.
ఈ మొబైల్ యాప్ ను మహిళలు తమ మొబైల్ ఫోనులో నిక్షిప్తం చేసుకొని, ఆపద సమయంలో పోలీసుల సహాయాన్ని,రక్షణను పొందవచ్చునన్నారు. ఈ మొబైల్ యాప్లో “ఎస్.ఓ.ఎస్” మరియు “సేఫ్ ట్రావెల్” పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ చొరవతో యువత, పోలీసులు సంయుక్తంగా షార్ట్ ఫిల్మ్ ను రూపొందించడం అభినందనీయమన్నారు. శక్తి యాప్ లోని ఎస్.ఓ.ఎస్. బటన్ ప్రెస్ చేయడం లేదా గాలిలో ఊపడం వలన ఆపదలో ఉన్నట్లుగా కాల్ సెంటరుకు సందేశాన్ని పంపుతుందన్నారు. వెంటనే, పోలీసులు స్పందించి దగ్గరలో ఉన్న పోలీసు స్టేషనుకు సమాచారాన్ని అందించి, వారిని రక్షించేందుకు, భద్రత కల్పించేందుకు చర్యలు చేవడతారన్నారు. అదేవిధంగా మహిళలు గుర్తు తెలియని వ్యక్తుల వాహనాల్లో ప్రయాణించే సమయంలో శక్తి యాప్లోని “సేఫ్ ట్రావెల్” బటన్ క్లిక్ చేయడం వలన వారి ప్రయాణంపై నిఘా ఏర్పాటు చేసి, సురక్షితంగా వారిని గమ్య స్థానానికి చేర్చడానికి పోలీసు చర్యలు చేపడతారన్నారు. షార్ట్ ఫిల్మ్ రూపొందించుటలో భాగస్వాములైన యువతీ, యువకులను, పోలీసు
లను మంత్రివర్యులు వంగలపూడి అనిత అభినందించారు.జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – మహిళల రక్షణకు పోలీసుశాఖ కట్టుబడి ఉందన్నారు. ప్రజలకు శక్తి మొబైల్ యాప్ పట్ల అవగాహన కల్పించేందుకు జిల్లాలో ఐదు బృందాలు పని చేస్తున్నాయన్నారు. ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా తమ మొబైల్ ఫోనులో శక్తి యాప్స్ డౌన్లోడు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎం.ఎస్.ఎం.ఈ.మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు అతిథి గజపతిరాజు, లోకం నాగ మాధవి, ఎమ్మెల్సీలు ఇందుకూరి రఘురాజు, గాదె శ్రీనివాసులనాయుడు, ఎంపి కలిశెట్టి అప్పల నాయుడు, కలెక్టరు డా.బి.ఆర్.అంబేద్కర్, జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, జాయింట్ కలెక్టరు సేతు మాధవ్, అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఇతర ప్రజా ప్రతినిధులు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.