

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 11 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని కంటోన్మెంట్ పోలీసు లైన్స్ లో నడపబడుతున్న శార్వాణి పోలీసు సంక్షేమ ఆంగ్ల పాఠశాలలో అదనపు తరగతుల నిర్మాణానికి జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపిఎస్ గారు జూలై 11న శంఖు స్థాపన చేసారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిధిగా హాజరుకాగా, వేద పండితుల మంత్రోచ్ఛరణతో జిల్లా ఎస్పీగారు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ – పోలీసు సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా పోలీసుశాఖ ఆధ్వర్యంలో తక్కువ ఫీజులతో పోలీసు పిల్లలకు, ఇతర విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నా మన్నారు. ఈ పాఠశాలలో నేడు నర్సరీ నుండి 10వ తరగతి వరకు 682 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నా రన్నారు. భవిష్యత్తులో మరి కొంతమంది విద్యార్థులు పెరిగే అవకాశం ఉన్నందున, విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని, వారి చదువుకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదన్న ఉద్దేశ్యంతో పాఠశాలలో అదనంగా మరో నాలుగు తరగతి గదులను శ్రమదానంతో నిర్మించాలని నిర్ణయించామన్నారు. ఇందుకుగాను ఈరోజును శంఖుస్థాపన చేసామన్నారు. త్వరితగతిన తరగతి గదులను నిర్మించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించామన్నారు. ఇటీవల మంచి నైపుణ్యం కలిగిన నలుగురు ఉపాధ్యాయులను, ఒక కంప్యూటర్ ఆపరేటర్ ను కూడా నియమించామన్నారు. పోలీసు సంక్షేమ ఆంగ్ల పాఠశాలను మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు, అందుకు తగిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) పి.సౌమ్యలత, అదనపు ఎస్పీ (ఎఆర్) జి. నాగేశ్వరరావు, డిపిఓ ఎ.ఓ. పి.శ్రీనివాసరావు, ఎస్బీ సిఐలు ఎ.వి.లీలారావు, ఆర్.వి.ఆర్.కే.చౌదరి, ఆర్ఐలు ఎన్.గోపాల నాయుడు, ఆర్.రమేష్ కుమార్, టి.శ్రీనివాసరావు, హెచ్ఎం సంధ్య, ఆఫీసు పర్యవేక్షకులు టి.రామకృష్ణ, ఇతర ఉపాధ్యాయులు, ఆర్ఎస్ఐలు ప్రసాదరావు, నీలిమ, రామకృష్ణ, ఎం.డి.ముబారక్ అలీ మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.