

జనం న్యూస్- జూలై 24- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలో మైనర్లు వాహనాలు నడపడం పరిపాటయింది. స్కూల్ కి వెళ్లే విద్యార్థులు సైతం ద్విచక్ర వాహనాలపై చక్కర్లు కొడుతున్నారు. స్కూల్ యాజమాన్యాలు సైతం పట్టించుకోకపోవడం, తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం మరియు అధికారుల నిఘా లేకపోవడంతో కాలనీ రోడ్లపై రయ్ రయ్ మంటూ తిరుగుతున్నారు. హిల్ కాలనీలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ వదిలే సమయంలో యువకులు త్రిబుల్ రైడింగ్ తో ఎదురు వచ్చే వాహనదారులను హడాలెత్తిస్తున్నారు. హిల్ కాలనీ బస్టాండ్ లో బైకులు పై వీరు చేసే ఫీట్లతో ఇతర వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు మండిపడుతున్నారు, హిల్ కాలనీలో చాలా వరకు సిసి రోడ్లు ఉండడంతో యువకుల బైక్ ల వేగానికి అడ్డు,అదుపు లేకుండా పోయింది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే చాలామంది యువతీ, యువకులు బైకులు నడుపుతున్నారని, రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోవడం వలన తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్స్ మరియు కాలేజీలు వదిలే సమయానికి, బస్టాండ్ మరియు మెయిన్ బజార్ నందు, రాత్రి సమయాలలో కూడా పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు