

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, జూలై 25 (జనం న్యూస్):
ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం లిక్కర్ స్కాం దర్యాప్తు పేరుతో ఏర్పాటు చేసిన సిట్ చట్ట ప్రకారం కాకుండా ఎల్లో మీడియా డైరెక్షన్‌లో పనిచేస్తోందని మాజీ ఎంపీపీ, వైసీపీ స్టేట్ ఆర్టీఐ విభాగం జనరల్ సెక్రటరీ కడప వంశీధర్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నిత్యం ఒక కొత్త కథను అల్లి ఎల్లో మీడియా ప్రచురిస్తుంటే, దానిని బట్టి సిట్ తన దర్యాప్తును ముందుకు తీసుకువెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్ట్‌కు సమర్పించని రిమాండ్ రిపోర్ట్‌లు కూడా ఎల్లో మీడియాలో ఒకరోజు ముందుగానే ప్రచురితం అవుతున్నాయంటేనే సిట్ ఎలా పనిచేస్తోందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. చంద్రబాబుకు భజన చేస్తున్న ఎల్లో మీడియా ఆయన కళ్ళలో ఆనందం చూడటం కోసమే ఇలాంటి దుర్మార్గమైన కథనాలను రాసి, సిట్‌ను నడిపిస్తోందని కడప వంశీధర్ రెడ్డి ధ్వజమెత్తారు.