Listen to this article

జనం న్యూస్ – ఆగస్టు1- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-

నాగార్జునసాగర్ హిల్ కాలనీ లో ఉన్న కెనరా బ్యాంకును సాగర్ నుంచి తరలించవద్దని బ్యాంకు ఖాతాదారులు కోరుతున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా నాగార్జునసాగర్ హిల్ కాలనిలో సాగర్ ప్రజలకే కాకుండా సాగర్ చుట్టుపక్కల ఉన్న గ్రామాల, తండాల రైతులకు సేవలు అందించిన కెనరా బ్యాంకు ను అనుముల మండలం హాలియా కు తరలించడానికి రంగం సిద్ధమైంది. ఈ విషయాన్ని నాగార్జునసాగర్ ప్రాజెక్టు కార్యాలయంలో కూడా తెలియచేస్తూ ప్రస్తుతము కెనరా బ్యాంకు ఉన్న భవనాన్ని త్వరలోనే అప్పగిస్తామని తెలియజేసినట్లుగా తెలుస్తుంది. గత రెండు మూడు నెలల క్రితమే ఈ విషయం వెలుగులోకి వచ్చిన ఖాతాదారుల నుండి నిరసనలు రావడంతో ఆగిపోయింది. కాగా శుక్రవారం నాడు సాగర్ లోని కెనరా బ్యాంకు ను అనుముల మండలం హాలియాలోకి తరలిస్తున్నట్టుగా బ్యాంకు బయట గోడలకు నోటీస్ బోర్డ్ ను అతికించారు. దీంతో బ్యాంకు వినియోగదారులు, ఖాతాదారులు తమ ఆర్థిక లావాదేవీలు చేయాలంటే సాగర్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాలియాకు వెళ్లాలా అని ఆందోళన చెందుతున్నారు. పదివేల పైచిలుకు ఖాతాలు మరియు 2000 పైన బంగారు రుణ ఖాతాలు కలిగి ఉన్న నాగార్జునసాగర్ కెనరా బ్యాంకు ను వేరే ప్రాంతానికి తరలించడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ బ్యాంకులో చుట్టుపక్కల ప్రాంతాల రైతులు, సాగర్లోని ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు గత కొన్ని సంవత్సరాలుగా ఖాతాదారులుగా ఉండి సేవలు పొందుతున్నారు. ప్రస్తుతం ఈ బ్యాంకును తరలిస్తున్నారని తెలుసుకొని ఆందోళన కు గురవుతున్నారు. సాగర్ నుండి కెనరా బ్యాంకును హాలియా కు తరలించడం కంటే హాలియా లోనే మరో కొత్త బ్రాంచ్ ని కెనరా బ్యాంక్ వారు ఏర్పాటు చేసుకోవాలని ఖాతాదారులు కోరుతున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఖాతాదారులకు సేవలు అందిస్తున్న కెనరా బ్యాంకు ను సాగర్ నుంచి తరలించవద్దని స్థానిక ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని, ఈ విషయంలో జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేయనున్నట్లుగా రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధులు తెలిపారు.