Listen to this article

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని సమగ్ర శిక్షా ఏపీసీ జి.మమ్మీలు పేర్కొన్నారు. కాట్రేనికోన మండలం చెయ్యేరు శ్రీనివాసా ఇంజనీరింగ్‌ కళాశాలలో నాలుగు రోజుల పాటు నిర్వహించిన మూడవ విడత స్కూల్‌ లీడర్‌షిప్‌ గురువారం సాయంత్రంతో ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఏపీసీ మమ్మీ మాట్లాడుతూ విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌కు ప్రతి ప్రధానోపాధ్యాయుడు సహ ఉపాధ్యాయులతో కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థు నమోదుకు సమాజ భాగస్వామ్యం అవసరమన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలిగించే విధంగా తరగతి గది లక్ష్యాలను సాధించాలన్నారు. నాయకత్వ లక్షణాలను ఆకళింపు చేసుకున్న ప్రధానోపాధ్యాయులు పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలని ఆమె వివరించారు. సమగ్ర శిక్షా ఏఎంవో, లీడర్‌షిప్‌ ట్రై నింగ్‌ కోర్సు కోఆర్డినేటర్‌ పి.రాంబాబు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మూడవ విడతలో 108 మంది ప్రధానోపాధ్యాయులకు శిక్షణనిచ్చినట్లు తెలిపారు. సమావేశంలో సమగ్ర శిక్షా సెక్టోరల్‌ అధికారులు బీవీవీ సుబ్రహ్మణ్యం, ఎంఈవోలు వైవీవీ సత్యనారాయణ, పి.శ్రీనివాసు తదితరులు మాట్లాడారు. శిక్షణను సమర్ధవంతంగా అందజేసిన మాస్టర్‌ ఫెసిలిటేటర్స్‌ పి.శ్రీనివాసు, చిట్టినీడి నిరంజని, ఎస్‌.సత్యకృష్ణ, ఎస్‌.ముత్యాలరావు, ఎ.రామచంద్రరావు, కె.శ్రీరామకృష్ణలను ప్రధానోపాధ్యాయులతో పాటుగా సమగ్ర శిక్షా ఏపీసీ జి.మమ్మీ, ఏఎంవో పి.రాంబాబు, సీఎంవో బీవీవీ సుబ్రహ్మణ్యం తదితరులను ఘనంగా సత్కరించారు. సమావేశంలో సమగ్ర శిక్షా పార్ట్‌టైమ్‌ ఇనస్ట్రక్టర్లు కె.వై.మౌనిక, సీహెచ్‌.మంగాదేవి, వి.తేజ, సిరిరాయల్, ఎన్‌.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.