

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 22 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
చిలకలూరిపేట పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న ఆక్రమణలను తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. నరసరావుపేట సెంటర్ నుంచి బైపాస్ వరకు ఉన్న రోడ్డుపై అక్రమంగా నిర్మించిన దుకాణాలు, ఇతర నిర్మాణాలను తొలగించాలని టౌన్ ప్లానింగ్ విభాగం నిర్ణయించింది. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఈ ఆక్రమణల తొలగింపు ప్రక్రియను చేపట్టాలని అధికారులు స్పష్టం చేశారు.ఈ ఆదేశాల మేరకు, టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ రోజు నరసరావుపేట సెంటర్లోని భారత్ పెట్రోల్ బంక్ వద్ద ఆక్రమణలను తొలగించడం ప్రారంభించారు. ఈ చర్య వల్ల పాదచారులు, వాహనదారులు సురక్షితంగా ప్రయాణించేందుకు అవకాశం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. ఇలాంటి చర్యలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని, పట్టణాన్ని మరింత సురక్షితంగా, ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.