జనం న్యూస్ 25 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
ఈ మధ్య కాలంలో మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారాలపై పెద్ద చర్చ నడుస్తున్నది. ట్రస్ట్ ఆస్తులపై వ్యక్తులు ఆధిపత్యం సంపాదించడానికి చేస్తున్న ప్రయత్నాలే ఇందుకు కారణం. దొంగలు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్లు, దీనికి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తోడయ్యారు. కొన్ని ట్రస్ట్ ఆస్తుల విలువ కోట్లలో ఉండటంతో, బెల్లం చుట్టూ ఈగల్లా పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా చేరుతున్నారు.
విజయనగరం మాన్సాస్ సంస్థ 1958 నవంబర్ 12న స్థాపించబడింది. విజయనగరం సంస్థానం చివరి రాజు డాక్టర్ పి.వి.జి. రాజు ఈ సంస్థను తన తండ్రి మహారాజా అలక్ నారాయణ్ గజపతి రాజు జ్ఞాపకార్థం ఏర్పాటు చేశారు. మన్సాస్ ట్రస్ట్ ఒక ప్రైవేట్ సంస్థ అయినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ ఛారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ ఎండౌమెంట్స్ యాక్ట్-1987 సెక్షన్ 6ఎ (1) కింద నమోదై ఉంది. దీనివల్ల సంస్థ వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వానికి నియంత్రణ ఉంటుంది. ట్రస్ట్ వారసత్వం వంశపారంపర్యంగా వస్తున్నప్పటికీ, ఛైర్మన్ నియామకంలో ప్రభుత్వమే ఉత్తర్వులు జారీ చేస్తూ ఉంటుంది. ఈ ట్రస్ట్ కింద ఉన్న ఆలయాలు, వాటి భూములకు సంబంధించిన వ్యవహారాలపై కూడా ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయి.
మాన్సాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కేజీ నుంచి పీజీ వరకు వివిధ స్థాయిలలో సుమారు 12 విద్యాసంస్థలు నడుస్తున్నాయి. ఆ తర్వాత కూడా 1950 నుండి స్థాపించిన కొన్ని విద్యాసంస్థలు ఉన్నాయి. ఇవిగాక మాన్సాస్ ట్రస్ట్‌కు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 14,800 ఎకరాల భూమి ఉంది. ప్రస్తుత విలువలో దీని ఆస్తుల మొత్తం వేల కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా. ఈ భూములతో పాటు ట్రస్ట్ నియంత్రణలో దాదాపు 108 దేవాలయాలు, వాటి భూములు కూడా ఉన్నాయి. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జమీందారీ వ్యవస్థ రద్దు చేయబడింది. 1951లో రాజ్యాంగానికి చేసిన మొదటి సవరణ ద్వారా జమీందారీ వ్యవస్థను రద్దు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పించారు. దీనితో, 1949 నుంచి 1951 మధ్య వివిధ రాష్ట్రాలలో జమీందారీ రద్దు చట్టాలు అమలయ్యాయి. అయితే, కొన్ని చోట్ల భూస్వాములు ఈ చట్టాలను కోర్టులో సవాలు చేయడంతో, జమీందారీ వ్యవస్థ రద్దు ప్రక్రియ పూర్తి కావడానికి కొంత సమయం పట్టింది. 1956 నాటికి దేశంలో జమీందారీ వ్యవస్థ పూర్తిగా రద్దయింది. భారతదేశంలో భూసంస్కరణల చట్టం రాష్ట్రాల వారీగా వివిధ సమయాల్లో అమలులోకి వచ్చింది. జాతీయ స్థాయిలో మార్గదర్శకాలు 1972లో రూపొందించబడినప్పటికీ, చాలా రాష్ట్రాలు 1950ల నుండి 1970ల మధ్యలో వివిధ చట్టాలను రూపొందించి అమలు చేశాయి. భూసంస్కరణల నుండి తమ భూములను కాపాడుకోవడానికి జమీందా రులు అనుసరించిన వ్యూహంలో భాగమే మాన్సాస్ ట్రస్ట్ ఏర్పాటు. భూసంస్కరణల చట్టాల నుండి కొన్ని రకాల భూములకు మినహాయింపులు ఇవ్వబడ్డాయి.అనేక రాష్ట్రాల భూపరిమితి చట్టాల నుండి మతపరమైన, విద్యా సంబంధమైన, ధార్మిక సంస్థల కింద ఉన్న భూములకు మినహాయింపు ఇచ్చారు. ఈ సంస్థలు (ట్రస్ట్‌లు) తమ లక్ష్యాల కోసం, అంటే పాఠశాలలు, ఆసుపత్రులు లేదా మతపరమైన కార్యక్రమాల నిర్వహణ కోసం భూమి ఉండటం అవసరమని భావించారు. ఈ మినహాయింపును అడ్డుపెట్టుకొని విజయనగరం రాజ వంశస్తులు మన్సాస్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి, తద్వారా తమ ఆస్తులను, భూములను స్వాధీనం చేసుకోకుండా కాపాడుకున్నారు. అలాగే వ్యవసాయ యోగ్యమైన సాధారణ భూమిని కూడా ”తోటల” భూమిగా చూపించి, దానిని స్వాధీనం చేయకుండా తప్పించుకున్నారు. అయితే ఇటీవల కాలంలో ట్రస్ట్ ఆస్తుల నిర్వహణపై వివాదాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా భూముల కేటాయింపులు, విక్రయాలు, ప్రభుత్వ జోక్యం వంటి విషయాలపై విమర్శలు వస్తున్నాయి. ఉదాహరణకు నగరంలోని పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న రైతు బజార్ స్థలాన్ని 22ఎ నుంచి తప్పించి, ప్రభుత్వ భూమిగా రాజులకు అధికారులు అప్పగించారు. గతంలో సంస్థానాల అధీనంలో ఈ భూమి ఉండేది. సంస్థానాలు రద్దయిన తర్వాత ఈ భూమి ప్రభుత్వపరమైంది. తర్వాత చాలా కాలం ఇక్కడ జిల్లా ఆసుపత్రి ఉండేది. శాశ్వత భవనాలు ఏర్పాటైన తర్వాత, జిల్లా ఆసుపత్రి అక్కడికి తరలిపోయింది. తర్వాత ఇక్కడ రైతుబజార్ ఏర్పాటైంది. ఇప్పుడు ఈ స్థలం మాది, మాకు అప్పగించాలని రాజ వంశస్తులు కలెక్టర్ మీద ఒత్తిడి తెచ్చారు. నిబంధనలను ఒక్క కలం పోటుతో మార్చి కోట్లు విలువ చేసే స్థలాన్ని జిల్లా అధికారులు రాజ కుటుంబీకుల చేతుల్లో పెట్టారు. ఇది ఇక్కడితో ఆగలేదు. విజయనగరం చరిత్రకు సాక్ష్యాలుగా ఉన్న ‘సింహాచలం మేడ’ ను కూడా సొంతం చేసుకుని కూల్చివేశారు. దీని తర్వాత ఒక్కోటిగా మిగిలిన చారిత్రక కట్టడాలను కూల్చివేసే ప్రతిపాదనలు కూడా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ట్రస్ట్ ఆస్తులు అంటే విజయనగరం ప్రజల ఆస్తి. విజయనగరం చారిత్రక సంపద. ఇవి వ్యక్తుల పేరునే ఉండి ఉంటే, జమీందారీ వ్యవస్థ రద్దయిన తర్వాత ప్రభుత్వ పరమయ్యేవి. కానీ అలా జరగకుండా ఉండటానికి, ట్రస్ట్‌ను అడ్డం పెట్టుకున్నారు. ఇప్పుడు వడ్డించే వాడే మనోడు కాబట్టి, సొంతం చేసుకునే పని ప్రారంభమైంది. ఇది ఆగాలంటే ప్రజాసంఘాలు, పౌరసమాజం ఒత్తిడి తేవాలి. మాన్సాస్ ఆస్తులను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలి. చారిత్రక సంపదను పరిరక్షించాలి.


