Listen to this article

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, జనవరి 27 (జనం న్యూస్):- 2024 సార్వత్రిక ఎన్నికల్లో పటిష్ట బందోబస్తు స్కీమ్ ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా, శాంతియుతంగా ముగిసే విధంగా సమిష్టిగా, సమన్వయంతో ఎలక్షన్ సెల్ విభాగంలో సమర్ధవంతంగా విధులు నిర్వహించిన 15 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి, వారికి ప్రశంసా పత్రాలను అందజేసారు.

జిల్లా యొక్క నైసర్గిక మరియు భౌగోళిక విస్తీర్ణం, సరిహద్దులు అసెంబ్లీ/పార్లమెంట్ నియోజకవర్గాలు, మండలాలు, పోలింగ్ లొకేషన్లు, పోలింగ్ స్టేషన్ లు యొక్క సమాచారం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ నుంచి వచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు అధికారులకు చేర వేయడం అధికారులు ఆదేశాల ప్రకారం వాటిని కోడీకరించటం, క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో పూర్తి సమాచారం, భద్రతా పరంగా ముందస్తు సమాచారం సేకరించటం, ప్రతి రోజు డిఎస్ఆర్ పంపటం, జిల్లాతో డిజిపి ఆఫీస్ మరియు ఎన్నికల కమిషనర్ లతో సమన్వయంతో జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు జరగటానికి కృషి చేశారని జిల్లా ఎస్పీ కొనియాడారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జనరల్ ఎలక్షన్ సమయంలో ప్రకాశం జిల్లాలో పకడ్బందీగా బందోబస్తు స్కీమ్ ను అమలు చేసినందుకు జిల్లా ఎలక్షన్ సెల్ ఇన్స్పెక్టర్ కి రాష్ట్ర ఎన్నికల కమీషన్ నుండి ఎక్సలెన్స్ ఇన్ కండక్టింగ్ ఎలక్షన్స్ అండ్ సెక్యూరిటీ మేనేజ్మెంట్”అవార్డు అందుకోవడం అభినందనీయమైన విషయమనీ, జిల్లాలో ఎక్కువ శాతం ఓటింగ్ నమోదు అయిందన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో మెరుగ్గా పని చేయాలని, జిల్లాలో ఎక్కడ ఎటువంటి శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా సమిష్టిగా కృషి చేయాలని సిబ్బందికి జిల్లా ఎస్పీ సూచించారు.

ఈ కార్యక్రమంలో ఐటి కోర్ సీఐ వి.సూర్యనారాయణ, ముండ్లమూరు ఎస్సై నాగరాజు, మహిళా పియస్ ఎస్సై వెంకటేశ్వర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.