Listen to this article

నాగార్జునసాగర్ లో కోతులు, కుక్కల దాడులతో బెంబేలెత్తుతున్న పర్యాటకులు, కాలనీవాసులు

జనం న్యూస్- సెప్టెంబర్ 4- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-

ప్రపంచ పర్యాటక క్షేత్రమైన నాగార్జునసాగర్ లో కోతులు, కుక్కలు దాడులతో అక్కడ నివసిస్తున్న ప్రజలు, పర్యాటకులు భయభ్రాంతులకు గురవుతున్నారు. నాగార్జునసాగర్ డ్యాం అందాలను చూడటానికి వచ్చిన పర్యాటకులకు కోతులు నుంచి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. డ్యామ్ గేట్లు పరిసర ప్రాంతాలలో, బుద్ధవనం, విజయ విహార్ అతిథి గృహాల వద్ద కోతులు గుంపులుగా తిరుగుతూ పర్యాటకుల బ్యాగులు, చేతి సంచులు ఎత్తుకెళ్లి చిందరవందర చేస్తున్నాయి, ఎదురు తిరిగితే దాడులకు దిగుతున్నాయి. కృష్ణమ్మ పరవళ్ళు చూస్తూ ప్రకృతిని ఆస్వాదిద్దాం అనుకున్న పర్యాటకుల ఆశలు కోతుల భయంతో ఆవిరైపోతున్నాయి. నాగార్జునసాగర్ కాలనీలలో నివసిస్తున్న ప్రజల బాధలు వర్ణనాతీతం, ఇళ్లల్లో తలుపులు తీసి ఉంటే కోతులు లోపలికి ప్రవేశించి గిన్నెలు, తినుబండారాలు, కూరగాయలు ఎత్తుకు వెళ్తున్నాయి, కోతులకు భయపడి స్త్రీలు, పిల్లలు, వృద్ధులు ఒంటరిగా బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది, స్కూల్ పిల్లలు సైతం కోతులు మరియు కుక్కల దాడులకు గురైన సంఘటనలు కూడా ఉన్నాయి. కోతులు, కుక్కలను నివారించాలనీ స్కూల్ విద్యార్థులు సైతం ర్యాలీలు నిర్వహించి అధికారులకు వినతి పత్రాలు అందించిన ఫలితం శూన్యం. మున్సిపల్ అధికారులు కంటి తుడుపు చర్యగా కొన్ని కుక్కలను పట్టి తీసుకువెళ్లి చేతులు దులుపుకున్నారు. వీధి కుక్కలకు కొంతమంది మెడకు బెల్టులు వేయటం వలన కుక్కల్ని పట్టుకెళ్ళ లేకపోతున్నామని మెడకు బెల్టు వేసిన పెంపుడు కుక్కలను తీసుకువెళ్లకూడదన్న నియమంతో అధికారులు ఏమి చేయలేమని చేతులెత్తేస్తున్నారు, వీధి కుక్కలు ద్విచక్ర వాహనాల వెంటపడి ప్రమాదాలు జరిగిన సంఘటనలు చాలానే ఉన్నాయి. కుక్కల దాడిలో గాయపడిన చిన్నారి హారిక పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉంది, ఇన్ని సంఘటనలు జరుగుతున్న అధికారులకు చీమకుట్టినట్లైనా లేకపోవడం గమనార్హం. వందమంది విద్యార్థులు వివిధ స్కూల్ ల నుంచి ర్యాలీగా వెళ్లి అటవీ శాఖ అధికారులకు వినతి పత్రం ఇచ్చిన కోతులను పట్టించే విషయమై అటవీ శాఖ అధికారుల నుంచి ఇప్పటికి వరకు ఎటువంటి స్పందన రాకపోవడం గమనార్హం, ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి స్థానికులకు పర్యాటకులకు కోతులు కుక్కల నుంచి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.