Listen to this article

పాపన్నపేట,సెప్టెంబర్12(జనంన్యూస్)

పాపన్నపేట మండల పరిధిలోని అన్నారం గ్రామ శివారులో ఫారెస్ట్ భూములు కబ్జాలకు గురవుతున్నాయి. స్థానికంగా జరుగుతున్న ఈ అక్రమాలకు సంబంధించి గ్రామస్తులు పలుమార్లు సంబంధిత అధికారులను సంప్రదించినా,వారు‘మాకు సంబంధం లేదు’అన్నట్టుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓక అధికారి రిటైర్మెంట్ దగ్గరగా ఉన్నానని,అందుకే తాను పట్టించుకోవడం లేదని స్పష్టంగా చెప్పాడని గ్రామస్తులు తెలిపారు.ఇక ఈభూములపై ఇప్పటికే కొంతమంది లెవెలింగ్ పనులు జరిపి సొంతం చేసుకున్నట్లు సమాచారం.మరోవైపు భూమి విషయంలో ఇరువర్గాల మధ్య తగాదాలు చెలరేగి కొట్లాటల దాకా వెళ్లాయి.చివరికి పోలీసులు జోక్యం చేసుకోవాల్సి రావడంతో ఇరువర్గాలు స్టేషన్‌ చేరగా, పెద్దమనుషులు మధ్యవర్తిత్వం చేసి నచ్చచెప్పినట్లు తెలుస్తోంది.అయితే,ఈ పరిణామాలు స్థానిక ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. “ఫారెస్ట్ భూములను ఇలా కబ్జా చేసుకుంటే, మిగతా ప్రకృతి సంపదకు రక్షణ ఎక్కడుంది?” అనే ప్రశ్నలు లేవుతున్నాయి.అధికారులు తమ బాధ్యతలను విస్మరించి పక్కన నిలబడితే ఇక మిగిలిన అడవి భూములు కూడా అక్రమాలకు గురయ్యే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి,అన్నారం శివారు ఫారెస్ట్ భూములను రక్షించకపోతే, భవిష్యత్తులో ఈప్రాంతంలో అడవి అడుగుజాడ కూడా కనబడదనే తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.ఫారెస్ట్ భూముల కబ్జాలపై ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని ప్రత్యేక దళాలను నియమించాలి.లేకపోతే ప్రకృతి సంపద కాపాడే అవకాశాలు కష్టమని స్థానికులు హెచ్చరిస్తున్నారు.