Listen to this article

జనం న్యూస్, సెప్టెంబర్ 13, పెద్దపల్లిపెద్దపల్లి శాంతినగర్‌కు చెందిన సానికొమ్ము రామ్ రెడ్డి, అంధుడైనప్పటికీ ప్రభుత్వ అనుమతులతో మట్టి వ్యాపారం కొనసాగిస్తున్నారు. అయితే రాఘవపూర్, కన్నాల, కాచాపూర్, కటికనపల్లి, ధర్మారం, గుల్లకోట, ఎలిగేడు, రాకలదేవ్‌పల్లె, కదంబాపూర్, కనకుల కనపర్తి, కాల్వ శ్రీరాంపూర్ ప్రాంతాలలో విచ్చలవిడిగా అక్రమ మట్టి త్రవ్వకాలు, తరలింపులు జరుగుతున్నాయని ఆయన శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అక్రమ దందా కారణంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందని, తాను చేసే వ్యాపారం కూడా తీవ్రంగా దెబ్బతింటోందని తెలిపారు. తనకు పెద్దపల్లి మండలం తురకలమద్దికుంట, ధర్మారం మండలం మల్లాపూర్ క్వారీలకు మాత్రమే మైనింగ్ శాఖ నుండి చట్టబద్ధమైన అనుమతులు ఉన్నాయని, ఇతర ఎక్కడా అనుమతులు లేవని అధికారులు స్పష్టంచేశారని చెప్పారు. అయినప్పటికీ కొందరు అక్రమంగా మట్టి త్రవ్వకం, రవాణా కొనసాగిస్తున్నారని, దీనివల్ల నేను డ్రైవర్లకు జీతాలు చెల్లించడానికే ఇబ్బందులు వస్తున్నాయని, తీవ్రంగా నష్టపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్, మైనింగ్, రెవెన్యూ శాఖ అధికారులు తక్షణం జోక్యం చేసుకొని అక్రమ మట్టి వ్యాపారంపై చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.