

జనం న్యూస్. తర్లుపాడు మండలం సెప్టెంబర్ 19.
ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం మేకలవారిపల్లి గ్రామం నందు 19 సెప్టెంబర్ 2025న పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఆత్మసంస్థ సహకారంతో పాడి రైతులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా కలుజువులపాడు పశువైద్యాధికారి డాక్టర్. సౌజన్య మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి వైరస్ వలన సోకుతుంది.పశువుల నుండి విడుదలైన చొంగ, కలుషితమైన గాలి,నీరు మేత ద్వారా వ్యాధి వ్యాప్తిస్తుంది. పాల ద్వారా దూడకి సోకి మరణించే అవకాశం ఉంది.ఈ గాలికుంటు వ్యాధి మూలంగా పాలిచ్చే పశువుల్లో పాల దిగుబడి తగ్గిపోతుంది,ఎద్దుల్లో పనిచేసే సామర్థ్యం సన్నగిల్లుతుంది. పశువులు కొద్దిపాటి ఎండకు రొప్పడం,నోటిలో,నాలుక మీద, పళ్ళ చిగుళ్ళు,కాలి గిట్టల దగ్గర బొబ్బలు ఏర్పడి పశువు తీవ్రంగా ఇబ్బంది పడుతూంటాయి నివారణ చర్యగా ప్రతి సంవత్సరం నాలుగు నెలలు పైబడిన ప్రతి పశువుకి వ్యాధి నివారణ టీకాలు రెండు దఫాలుగా చేయించినట్లయితే పశువులలో వ్యాధి నిరోధక శక్తి పెంపొంది,పాల దిగుబడి తగ్గకుండా ఉండేట్లు చూసుకోవచ్చు. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 15 వరకు అన్ని గ్రామాలలో కూడా పశుసంవర్ధక శాఖ సిబ్బంది టీకాలు చేస్తున్నారని రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి పశువుకి గాలికుంటూ వ్యాధి నివారణ టీకాలు చేయించాలని సూచించారు. ఈ కార్యక్రమం లో పశుసంవర్ధక శాఖ సిబ్బంది విఏ కవిత,ఏ హెచ్ ఏ మనోజ్, ఏ హెచ్ ఏ గురవయ్య గోపాలమిత్రాలు రాము, రామయ్య,కోటిరెడ్డి, డాక్టర్ ఫార్మా రిప్రెసెంటేటివ్స్ గ్రామంలోని పాడి రైతులు పాల్గొనడం జరిగింది.


