Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం సెప్టెంబర్. 23

మీర్జపేట మరియు కారుమనిపల్లి గ్రామాలలో మండల వ్యవసాయ అధికారి పి జోష్నాదేవి పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులు తప్పనిసరిగా ఈ పంట నమోదు చేసుకోవాలని సూచించారు. పంటలు సాగు చేసే పొలాలను మరియు రైతులు పంట వేయకుండా బీడు గా ఉంచుకున్న ప్రతి సర్వే నెంబర్ ను గ్రామ వ్యవసాయ సహాయకులు ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. మినుములు 30% సబ్సిడీపై అన్ని రైతుసేవా కేంద్రాలలో అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. అనంతరం వరి పంట పొలాలని సందర్శించి, వరి పొలాల్లో నాటిన 2 నుండి 6 వారాల్లో ముదురాకు చివర్లలో, మధ్య ఈనెకు ఇరుప్రక్కల తుప్పు లేక ఇటుక రంగు మచ్చలు కనబడతాయి. ఆకులు చిన్నవిగా, పెలుసుగా ఉండి వంచగానే శబ్దం చేస్తూ విరిగిపోతాయి. మొక్కలు గిడసబారి దుబ్బు చేయవు, పైరుపై జింక్ లోపం కనిపించగానే లీటర్ నీటికి 2 గ్రా. జింక్ సల్ఫేట్ కలిపి వారం వ్యవధిలో 2 నుండి 3 సార్లు పిచికారి చేయాలి. కాండం తొలిచే పురుగు మరియు ఆకుముడత పురుగు నివారణకు క్లోరోపైరిఫాస్ 2.5 మి.లీ లేక ఎసిఫేట్ 1.5 గ్రా. లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలని రైతులకి సూచించారు. కార్యక్రమంలో జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ ప్రసాద్,ఏఈఓ దేవేంద్ర గౌడ్, VAA గణేష్, రైతులు పాల్గొన్నారు.