Listen to this article

మూడు కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

జనం న్యూస్ సెప్టెంబర్ 27 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు: ప్రభుత్వ సహకారం ప్రజల భాగస్వామ్యంతో నియోజకవర్గ కేంద్రమైన పటాన్ చేరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్తున్నామని స్థానిక శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శనివారం పటాన్ చేరు డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ, సీతారామపురం కాలనీ, శాంతినగర్ కాలనీ, గౌతమ్ నగర్ కాలనీ, కృషి డిఫెన్స్ కాలనీలలో మూడు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్లు, బీటి రోడ్డు, వరద నీటి కాలువల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఏర్పాటవుతున్న కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. పూర్తి పారదర్శకతతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు..ఈ కార్యక్రమంలో పటాన్ చేరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, ఎం డి ఆర్ ఫౌండర్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.