Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ 03 సంగారెడ్డి జిల్లా

రామచంద్రపురం మల్లికార్జున నగర్ కాలనీలో దుర్గ భవాని యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 19వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు శనివారం రాత్రి వైభవంగా ముగిశాయి. తొమ్మిది రోజులపాటు అద్భుతమైన అలంకరణలతో, పూజా కార్యక్రమాలతో, సాంస్కృతిక వినోదాలతో కొనసాగిన ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు చివరి రోజు ఊరేగింపుతో ముగిశాయి.అమ్మవారి ఊరేగింపు మంగళవాయిద్యాల నడుమ భక్తుల నినాదాలతో అతి శోభాయమానంగా సాగింది. ఈ సందర్భంగా నిర్వహించిన చీర వేలంపాటలో పవన్‌కుమార్ ₹1,20,000కు దక్కించుకోగా, నోట్లదండను ఈశ్వర్ ₹70,000లకు సొంతం చేసుకున్నారు.వేలంపాటలో కాలనీవాసులు ఉత్సాహంగా పాల్గొని ఉత్సవ వైభవాన్ని మరింతగా పెంచారు.సాంస్కృతిక కార్యక్రమాల్లో బాలబాలికలు, యువతులు, కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించగా, ప్రేక్షకులు విపరీతంగా ఆకర్షితులయ్యారు. ప్రత్యేకంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించిన దుర్గ భవాని యూత్ అసోసియేషన్ సభ్యులను కాలనీవాసులు ప్రశంసలతో ముంచెత్తారు. ప్రతి సంవత్సరం శరన్నవరాత్రి వేడుకలను మరింత విశిష్టంగా నిర్వహిస్తూ వస్తున్న ఈ సంఘం, ఈసారి కూడా భక్తుల మనసులను హత్తుకునేలా కార్యక్రమాలను విజయవంతం చేసింది.