

జనం న్యూస్. తర్లుపాడు మండలం. అక్టోబర్ 13
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతి వ్యక్తి తమ పుట్టినరోజున ఒక మొక్క నాటితే ఊరికి మేలు చేసిన వారవుతారని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మార్కాపురం శాఖ అధ్యక్షులు గుంటక సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. తర్లుపాడు మండలం మీర్జాపేట గ్రామపంచాయతీలో మానవతా సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మీర్జాపేటలోని మండల పరిషత్ పాఠశాల, గ్రామ సచివాలయ ప్రాంగణాలతో పాటు, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటారు. అనంతరం, గ్రామంలోని నాలుగు రోడ్ల కూడలి వద్ద ప్రజలతో సమావేశమై, ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలను పర్యావరణానికి వాటిల్లే నష్టాన్ని వివరించి అవగాహన కల్పించారు.అనంతరం జరిగిన సమావేశంలో మానవతా సంస్థ అధ్యక్షులు గుంటక సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రతి మనిషి తన జన్మదినం సందర్భంగా ప్రతి ఏటా ఒక మొక్క నాటితే, తన జీవితకాలంలో గ్రామానికి ఎంతో మేలు చేసిన వారు అవుతారు అని అన్నారు. ఈ రోజు తన జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన గ్రామ ప్రజలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.సంస్థ కార్యదర్శి అన్నా రాము మాట్లాడుతూ, చెట్టు తన జీవితకాలమంతా ఫలాలు, కలప, ఆక్సిజన్ అందిస్తూ మానవాళికి ఆర్థిక పరిపుష్టిని చేకూరుస్తుందని అన్నారు. గ్రామ కార్యదర్శి కాలంగి శ్రీనివాసులు మాట్లాడుతూ, నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతను ప్రతి వ్యక్తి తీసుకున్నప్పుడే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి దుర్భశుల పెద్దమీరయ్య, గ్రామ నాయకులు నరసింహులు, వెంకటేశ్వర్లు, తిరుపతయ్య, మానవతా సంస్థ కోశాధికారి తడికమళ్ళ శ్రీనివాసరావు, డైరెక్టర్లు ఎస్వీఎల్ గుంటక చెన్నారెడ్డి, ఆర్.కె.జి, కస్సెట్టి జగన్, గంగిశెట్టి కిరణ్, నారాయణ వెంకటేశ్వర్లు, గుంటక వనజాక్షి, కె. మల్లేశ్వరి, రేణుక తదితరులు పాల్గొన్నారు.
