

రోడ్లపై పేరుకుపోయిన చెత్తతో అవస్థలు పడుతున్న కాలనీవాసులు
నిధుల లేక సమస్యల వలయంలో నందికొండ మున్సిపాలిటీ
జనం న్యూస్- అక్టోబర్ 13- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ –
నందికొండ మున్సిపాలిటీ పరిధిలో గత కొన్ని రోజులుగా మున్సిపాలిటీ చెత్త సేకరణ వాహనాలు వార్డులలోకి రాకపోవడంతో వీధులలో చెత్త పేరుకుపోయింది. ఒకపక్క వర్షాలు పడుతుండడంతో చెత్త తడిసి దుర్వాసన వెదజల్లుతుంది. వర్షాకాలం కావడం, సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న మున్సిపల్ అధికారులు చెత్తను తరలించడం లేదని,పారిశుద్ధ్య నిర్వహణ లోపంతో ప్రజలు రోగాల బారిన పడి ఇబ్బందులు పడుతున్న అధికారులలో చలనం లేదని ప్రజలు వాపోతున్నారు. వర్షాకాలం ప్రారంభమైన ఇప్పటివరకు దోమల నియంత్రణకు ఫాగింగ్ కార్యక్రమం మొదలుపెట్టలేదని, దోమలు పెరిగి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయని ఇప్పటికైనా అధికారులు స్పందించి దోమల నివారణకు ఫాగింగ్ చేయాలని నందికొండ వాసులు కోరుతున్నారు.డీజిల్ లేక నిలిచిపోయిన చెత్త సేకరణ వాహనాలునందికొండ మున్సిపాలిటీ 12 వార్డులకు కలిపి నాలుగు చెత్త సేకరణ వాహనాలు ఉండగా రెండు చెత్త సేకరణ వాహనాలు మెయింటెనెన్స్ సరిగా లేక మూలనపడ్డాయి. మిగిలిన రెండు చెత్త సేకరణ వాహనాలకి డీజిల్ లేక పక్కన పెట్టారు. కొన్ని రోజులు మున్సిపాలిటీకి చెందిన ట్రాక్టర్లతో మెయిన్ బజార్లలో చెత్తను సేకరించిన ట్రాక్టర్లలో కూడా డీజిల్ లేక పక్కన పెట్టారు.పెట్రోల్ బంకులలో బకాయిలు పెరిగిపోవడంతో మున్సిపాలిటీ వాహనాలకు డీజిల్ కొట్టట్లేదని వినికిడి. పారిశుద్ధ్య కార్మికులకు సైతం మూడు నెలలుగా జీతాలు లేక అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి నందికొండ మున్సిపాలిటీకి నిధులు కేటాయించి నందికొండ మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని స్థానికులు కోరుతున్నారు.చెత్త సేకరణ వాహనాలపై ఫోన్ లైన్ లో నందికొండమున్సిపల్ కమిషనర్ చింత వేణును సంప్రదించడానికి ప్రయత్నించగా అందుబాటులో లేరు.