Listen to this article

బిచ్కుంద అక్టోబర్ 14 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. ప్రిన్సిపాల్ మేడం వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ రోడ్డుపైకి వచ్చి ధర్నా నిర్వహించారు. విద్యార్థులు పేర్కొన్న వివరాల ప్రకారం, పాఠశాలలో కనీస సదుపాయాలు లేకపోవడం, భోజన నాణ్యత బలహీనంగా ఉండడం, హాస్టల్ గదుల్లో తాగునీటి మరియు పరిశుభ్రత సమస్యలు ఉండడం వంటి అంశాలపై పునరావృతంగా ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో నిరసనకు దిగినట్లు తెలిపారు. పైగా సమస్యలు చెప్పిన విద్యార్థులపై శిక్షాత్మక చర్యలు తీసుకోవడం పట్ల విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ విషయం తెలిసిన మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే గారు, రోడ్డుపైన ధర్నా చేస్తున్న విద్యార్థుల వద్దకు స్వయంగా చేరుకుని వారితో మాట్లాడారు. విద్యార్థుల ఆవేదనను శ్రద్ధగా విని,“మీరు ఎవరూ భయపడవద్దు. మీ సమస్యలను నేను స్వయంగా జిల్లా కలెక్టర్ గారికి తెలియజేస్తాను. ప్రిన్సిపాల్‌పై తగిన విచారణ జరిపి చర్యలు తీసుకునేలా చూస్తాను,”అని హామీ ఇచ్చారు.