పయనించే సూర్యుడు అక్టోబర్ 15,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
పేద, మధ్య తరగతి ప్రజల భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ రేట్లను ప్రతి వ్యాపారి ఖచ్చితంగా అమలు చేయాలని నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు అభిరుచి మదు అన్నారు. మంగళవారం ఓ ప్రకటనలో మాట్లాడుతూ, “ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజా హితమైనది. కానీ దాన్ని వ్యాపారులు నిజాయితీగా అమలు చేయకపోతే ఉద్దేశం వృథా అవుతుంది” అని స్పష్టం చేశారు.జీఎస్టీ రేట్ల తగ్గింపును ప్రభుత్వం అధికార యంత్రాంగం కఠినంగా పర్యవేక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. “తగ్గిన రేట్ల ప్రకారం వస్తువులు అమ్ముతున్నారా లేదా అనే విషయాన్ని రెవెన్యూ, కమర్షియల్ ట్యాక్స్ అధికారులతో సమీక్షించాలి. బీజేపీ కార్యకర్తలు కూడా గ్రామాల, పట్టణాల స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలి” అని అభిరుచి మదు సూచించారు.జీఎస్టీ పాంప్లెట్లు, అవగాహనా ప్రచారాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి బీజేపీ ముందుండబోతోందని ఆయన తెలిపారు. “ప్రజల మేలు కోసం తీసుకున్న నిర్ణయాలను సరైన రీతిలో అమలు చేయడం బీజేపీ బాధ్యతగా భావిస్తోంది” అని స్పష్టం చేశారు.”తగ్గిన జీఎస్టీ ధరలకే విక్రయం జరగాలి — కేంద్ర నిర్ణయాన్ని వక్రీకరించే ప్రయత్నాలు సహించం” అని అభిరుచి మదు హెచ్చరించారు.


