Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ 16:ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మీడియా ప్యానలిస్టుల జాబితాను బుధవారం సాయంత్రం ఆ పార్టీ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 19 మంది నాయకులకు ఈ జాబితాలో చోటు దక్కింది. ప్రకాశం జిల్లా నుంచి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి ఈ జాబితాలో స్థానం పొందడం విశేషం.. ఈ సందర్భంగా స్పందించిన డాక్టర్ ఏలూరి “ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. పార్టీ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా కృషి చేస్తాను. బీజేపీ సిద్ధాంతాలు, ప్రజా ప్రయోజనాలు ప్రతీ వేదికలో గళమెత్తి వినిపిస్తాను” అని పేర్కొన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం పెద్దారవీడు మండలం, గొబ్బూరు గ్రామానికి చెందిన ఏలూరి రామచంద్రారెడ్డి.. మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా, అలాగే పశ్చిమ రాయలసీమ శాసన మండలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేశారు. గతంలో కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల్లో కూడా కీలక భూమిక పోషించారు, అయితే జాతీయవాద భావజాలంతో మెలిగే ఆయన.. ఆ పార్టీల వ్యవహారశైలి నచ్చక దేశం కోసం ధర్మం కోసం పనిచేయాలన్న సంకల్పంతో 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు.. విద్యార్థి దశనుంచే రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు.. విద్యార్థి సమయంలో ఏబీవీపిలో పనిచేశారు.. స్పష్టమైన వాగ్ధాటి, విశ్లేషణా సామర్థ్యం కలిగిన నేతగా ప్రసిద్ధి చెందిన ఏలూరి, వివిధ టీవీ చర్చల్లో బీజేపీ వాయిస్‌ను బలంగా వినిపిస్తారన్న నమ్మకంతో పార్టీ అధిష్టానం ఈ బాధ్యతను అప్పగించినట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే రాజకీయంగా, మేధోపరంగా బలమైన నాయకుడిగా గుర్తింపు పొందిన డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి, పార్టీ భవిష్యత్తు వ్యూహాత్మక ఆలోచనల్లో కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఆయనకు ఈ పదవి దక్కడంతో అనుచరగణం సంబరాల్లో మునిగితేలుతున్నారు.