Listen to this article

ఒడిశా నుండి తెచ్చిన 10 కిలోల ఎండు గంజాయి స్వాధీనం

జనం న్యూస్, అక్టోబర్ 24:

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ముత్తంగి గ్రామ శివారులో పోలీసులు గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు.వివరాల్లోకి వెళితే—మహారాష్ట్ర రాష్ట్రం ఉస్మానాబాద్ జిల్లా, మహారాష్ట్రకు చెందిన సంతోష్ మధుకర్ చవాన్ (వయస్సు 34 సంవత్సరాలు) అనే వ్యక్తి ఒడిశా రాష్ట్రంలోని ఖుర్దా గ్రామానికి చెందిన సురేష్ బేహార్ అనే వ్యక్తి వద్ద నుండి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి, ఎక్కువ ధరకు అమ్మి డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో రవాణా చేస్తున్నాడు.ఈ క్రమంలో అతను 10 కిలోల ఎండు గంజాయిని తన సంచిలో బట్టల మధ్య దాచిపెట్టి తెచ్చాడు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై రాజు తన సిబ్బందితో ముత్తంగి సమీపంలోని ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్–3 వద్ద సర్వీస్ రోడ్డుపై 24వ తేదీ సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో అక్కడ కూర్చున్న సంతోష్ మధుకర్ చవాన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, అతని వద్ద నుండి 10 కిలోల ఎండు గంజాయి మరియు ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటనపై ఎస్సై రాజు ఫిర్యాదు మేరకు ఎండి ఆసిఫ్ అలీ ఎస్సై కేసు నమోదు చేసి, విచారణలో భాగంగా నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.