విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్
జనం న్యూస్ 01 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విజయనగరం పట్టణం మూడు లాంతర్లు జంక్షన్ నుండి కోట జంక్షను వరకు జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో “క్యాండల్ ర్యాలీ”ని అక్టోబరు 31న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ ముఖ్య అతిధిగా హాజరై, “క్యాండిల్ ర్యాలీ”ని ప్రారంభించారు.పట్టణంలోని మూడు లాంతర్లు జంక్షను నుండి కోట జంక్షను వరకు నిర్వహించిన ర్యాలీలో పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్ధులు, ప్రజలు పాల్గొని, పోలీసు అమరవీరుల చిత్ర పటాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి, పోలీసు అమరవీరులకు జోహార్లు అర్పించి, అమరవీరుల సంస్మరణ వారోత్సవాలకు ముగింపు పలికారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఐపిఎస్ మాట్లాడుతూ – పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఓపెన్ హౌస్, ర్యాలీలు, వ్యాస రచన, వక్తృత్వ పోటీలను, రక్తదాన శిబిరాలు, మెడికల్ క్యాంప్లు నిర్వహించామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా విధులు నిర్వహిస్తూ అనేక మంది పోలీసులు తమ ప్రాణాలను సైతం కోల్పోయారన్నారు. ఉమ్మడి జిల్లాలో ఐదుగురు పోలీసు అధికారులు అంతర్గత భద్రతను పరిరక్షిస్తూ అమరులయ్యారని, భౌతికంగా నేడు మన మధ్య లేకున్నా, ప్రజల గుండెల్లో జీవించే ఉన్నారని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ అన్నారు.పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాల్లో భాగంగా జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో పోలీను అధికారులు/సిబ్బంది, పోలీసు పిల్లలు, స్కూలు/కళాశాల విద్యార్థులకు మూడు కేటగిరీలుగా విభజించి, వ్యాస రచన, వక్తృత్వ పోటీలను వేరు వేరుగా నిర్వహించి, విజేతలుగా నిలిచిన వారికి జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ప్రోత్సాహక నగదు బహుమతులను, ప్రశంసా పత్రాలను త్వరలో అందజేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ఎఆర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు, విజయనగరం ఇన్చార్జ్ డిఎస్పీ ఆర్.గోవిందరావు, విజయనగరం ఏఆర్ డిఎస్పీ ఈ. కోటిరెడ్డి, సిఐలు ఎ.వి.లీలారావు, ఆర్.వి.ఆర్.కె.చౌదరి, టి.శ్రీనివాసరావు,బి.లక్ష్మణరావు, సూరినాయుడు, ఈ.నర్సింహమూర్తి, ఆర్ఐలు, ఆర్.రమేష్ కుమార్, శ్రీనివాసరావు, పలువురు ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


