Listen to this article

జనం న్యూస్ నవంబర్ 04( కొత్తగూడెం నియోజకవర్గం )

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాయీబ్రాహ్మణుల సంక్షేమం కోసం తక్షణమే ప్రత్యేక నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని భద్రాచలం నాయీబ్రాహ్మణ సేవా సంఘం గౌరవాధ్యక్షుడు ములగాల వాసు డిమాండ్ చేశారు.ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు గడిచినా రాష్ట్రంలో నాయీబ్రాహ్మణులు రాజకీయ, సామాజికంగా అణచివేతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కులవృత్తి అయిన క్షురకర్మ చేస్తూ చాలీచాలని ఆదాయంతో జీవనం సాగిస్తున్న నాయీబ్రాహ్మణులు అభివృద్ధికి దూరమవుతున్నారని పేర్కొన్నారు.జిల్లా, మండల కేంద్రాల్లో పెద్ద పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థలు బ్యూటీ పార్లర్లు, స్పా పేర్లతో పెద్దసెలూన్లు ప్రారంభించి నాయీబ్రాహ్మణుల జీవనాధారాన్ని దెబ్బతీస్తున్నారని తెలిపారు. దేవాలయాల్లో సేవచేస్తున్న నాయీబ్రాహ్మణులకు ఎలాంటి ఉద్యోగ భద్రత, ఆరోగ్య రక్షణా సదుపాయాలు లేవని ఆయన విమర్శించారు.ప్రభుత్వం తక్షణమే నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, నిధులు కేటాయించి, పాలకమండలి ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా కార్పొరేట్ సెలూన్లకు దీటుగా ప్రభుత్వ సహకారంతో ఆధునిక నాయీబ్రాహ్మణ సెలూన్లు ఏర్పాటు చేయాలని సూచించారు.ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చిన నాయీబ్రాహ్మణేతరులు ఏర్పాటు చేసే సెలూన్లు, స్పా సెంటర్లకు స్థానిక నాయీబ్రాహ్మణ సంఘం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలనే జీఓ ప్రభుత్వం జారీ చేయాలని ఆయన కోరారు. దేవాలయాల్లో పనిచేసే నాయీబ్రాహ్మణులకు ఆలయ పాలకమండళ్లలో స్థానాలు ఇవ్వాలని, సంఘాల ఫెడరేషన్‌కు అవసరమైన నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.నాయీబ్రాహ్మణులపై జరుగుతున్న దాడులపై అట్రాసిటీ చట్టం తీసుకురావాలని, రాజకీయ పార్టీలన్నీ తమ పార్టీల్లో నాయీబ్రాహ్మణులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. డిమాండ్లపై ప్రభుత్వం సమాలోచన చేయకపోతే, ఇతర బీసీ కులాలను కలుపుకుని పెద్దఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.మాజీ అధ్యక్షుడు ఆందుర్తి క్రాంతి మాట్లాడుతూ బీసీ లకు 42% రిజర్వేషన్లు సాధించేందుకు చేస్తున్న ఉద్యమానికి నాయీబ్రాహ్మణులు కూడా తోడుగా ఉంటారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎలాగైతే పోరాడామో, అలాగే బీసీలకు విద్య, ఉద్యోగం, రాజకీయ రిజర్వేషన్లు సాధించేవరకు పోరాటం కొనసాగుతుందన్నారు.ఈ సమావేశంలో సెక్రటరీ సోమనపల్లి నాగేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు కొంగర శ్రీను, ఆందుర్తి వెంకటరావు, మార్కాపురం వెంకన్న, మార్కాపురం శీతారాములు, ప్రభాకర్ (చంటి), చిన్నా, ఉపేంద్ర, నరహరి, పంబి సత్యనారాయణ, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.