జనం న్యూస్ 06 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
తెలుగు రాష్ట్రాలను వరుస బస్సు ప్రమాదాలు వణికిస్తున్నాయి. ఏపీలో కర్నూలు, తెలంగాణాలో చేవెళ్ళ సమీపంలో ఘోర బస్సు ప్రమాదాల నుండి తేరుకునే లోపే ఏపీ లోని పార్వతీపురం-మన్యం జిల్లాలో మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖ నుండి ఒడిశాలోని జైపూర్ వెళ్తున్న ఒడిశాకు చెందిన ఆర్టీసీ ( ఓ ఎస్ ఆర్ టీ సీ ) బస్సులో… పార్వతీపురం-మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలోని మంటల చెలరేగాయి. అయితే బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న ప్రయాణీకులను అందరికీ అప్రమత్తం చేసి… క్రిందకు దించేయడంతో అందరూ సురక్షితంగా బయపడ్డారు. అయితే ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమయింది. బస్సు అగ్నికి ఆహుతవుతున్న దృశ్యాలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలోని ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ఘాట్ రోడ్డులో బస్సులో మంటలు చెలరేగాయి. OD 10S 6754 బస్సులో మంటలు రావడాన్ని గుర్తించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యారు. చెక్‌పోస్టు వద్ద బస్సును నిలిపివేసి ప్రయాణీకులను అప్రమత్తం చేశారు. దీనితో ప్రయాణీకులంతా ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. సమాచారం అందుకున్న సాలూరు ఫైర్ స్టేషన్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. సకాలంలో చర్యలు తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడడంతో ఆర్టీసీ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. స్థానిక పోలీసుల సమాచారంతో పార్వతీపురం-మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి… ఒడిశా ఆర్టీసీ బస్సు దగ్ధమైన ప్రాంతాన్ని పరిశీలించారు. ఘటనకు గల కారణాలును బస్సు సిబ్బంది, ప్రయాణీకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ… ఉదయం 07.00– 07.20 మద్యంలో అగ్నిప్రమాదం జరిగింది. ఘాట్ రోడ్డు ఎక్కుతుండగా బస్సు ఇంజిన్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించి ఉంటాయని అనుకుంటున్నాం. ఘటన జరిగేటప్పుడు బస్సులో పది మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ అప్రమత్తత కావడంతో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. వెంటనే పాచిపెంట పోలీసులు, సాలూరు అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. ఫైర్ , ఆర్.టి.ఓ సిబ్బంది తో విచారణ చేయించి మంటలకు కారణాలను వెలికితీస్తాం. బస్సు ఒడిశా రాష్ట్రానికి చెందింది. లేటెస్ట్ బస్సే అయినా ఘాట్ రోడ్డు కావడంతో ఇంజిన్ లో మంటలు వచి ఉండొచ్చు అని అన్నారు.


