Listen to this article

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 13 – 11- 2025

ఉదయం *8.45 గంటలకు తొలి రౌండ్‌ ఫలితలు అధికార, విపక్షాల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగిన జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఫలితం మరో 24 గంటల్లో తేలనుంది.సిట్టింగ్‌ స్థానాన్ని నిలుపుకోవాలని బీఆర్‌ఎస్ ఎలాగైనా జూబ్లీహిల్స్‌పై జెండా ఎగురవేయాలని కాంగ్రెస్‌ సర్వశక్తులూ ఒడ్డి పోరాడాయి. సుమారు నెలరోజుల పాటు పార్టీలు తమ నాయకత్వాన్ని నియోజకవర్గంలో మోహరించాయి. విమర్శలు, ప్రతివిమర్శలు, సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో గెలిచేదెవరో శుక్రవారం తేలనుంది. ఇప్పటికే అధికారులు ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తిచేశారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో లెక్కింపు ప్రారంభం కానుంది. పది రౌండ్లలో లెక్కింపు పూర్తి చేయాలని నిర్ణయించారు.ఉప ఎన్నికలో లక్షా 94 వేల 632 ఓట్లు పోలయ్యాయి. వీటిని పది రౌండ్లుగా 42 టేబుళ్లపై లెక్కింపు జరుపనున్నారు. తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌, ఆ తర్వాత 103 హోం ఓటింగ్‌లను లెక్కించిన తర్వాత ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. సాధారణంగా 14 టేబుళ్లపై కౌంటింగ్‌ జరుగుతుంది. ఉప ఎన్నిక కావడం, ఉద్యోగులు అందుబాటులో ఉండడంతో ఎక్కువ టేబుళ్లు ఏర్పాటు చేసి త్వరగా లెక్కింపు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఉదయం 8.45 గంటలకల్లా తొలి రౌండ్‌ ఫలితం వెల్లడి కానుంది. మధ్యాహ్నం ఒంటి గంటలోపే తుది ఫలితాన్ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తున్నది.రౌండ్లవారీగా ఫలితాలు..ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని మొత్తం 10 రౌండ్లుగా కొనసాగించనున్నారు. ఒక్కో రౌండ్‌ వారీగా ఫలితాలను వెల్లడించనున్నారు. ఎన్నికల బరిలో 58 అభ్యర్థులతో పాటు నోటాకు పోలైన ఓట్ల సంఖ్యను అధికారులు వెల్లడించనున్నారు. కాగా కౌంటింగ్‌ కేంద్రంలో పటిష్టమైన మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. దీనికితోడు సీసీ కెమెరాలతో పర్యవేక్షణ, సాయుధ బలగాలతో 24గంటల పహారా ఉండనుంది. స్టేడియానికి 100 మీటర్ల మేరలో ఆంక్షలు ఆమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు.పోలింగ్‌ 48.49 శాతం..ఎన్నిక ఏదైనా మా వైఖరిలో తేడా ఏమీ ఉండదని జూబ్లీహిల్స్‌ ఓటర్‌ మరోసారి నిరూపించారు. ప్రతిసారీ జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో పోలింగ్‌ 50 శాతానికి మించడం లేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో 47.49 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. తాజాగా ఉప ఎన్నికలో 48.49 శాతం పోలింగ్‌ నమోదు అయ్యింది. ఇక్కడ కేవలం ఒక్కశాతం మాత్రమే పోలింగ్‌ శాతం పెరగడం గమనార్హం. ఉప ఎన్నిక సమయానికి నియోజకవర్గంలో మొత్తం 4.01 లక్షల ఓటర్లు ఉండగా.. లక్షా 94వేల 631 మంది మాత్రమే ఓటుహక్కును వినియోగించుకున్నారు. కేవలం 48.49 శాతం పోలింగ్‌ మాత్రమే నమోదు అయినట్లు జిల్లా ఎన్నికల అధికారులు బుధవారం అధికారికంగా ప్రకటించారు. 99,771 మంది పురుషులు (అత్యధికం) ఓటు వేశారు.బస్తీల్లో ఉండే ఓటర్లు…బస్తీల్లో ఉండే ఓటర్లు ఓటేసేందుకు ఆసక్తి చూపగా, అపార్ట్‌మెంట్లలో ఉన్న ఓటర్లు చాలావరకు ఓట్లు వేయనట్లు తెలుస్తోంది. మరోవైపు కొత్తగా ఓటుహక్కు వచ్చిన యువత ఓటు వేసేందుకు ఉత్సాహం కనబర్చారు. అయితే పోలింగ్‌ శాతం తగ్గడానికి కారణాలు లేకపోలేదని విశ్లేషకుల అంచనా.. ప్రైవేట్‌ ఉద్యోగులకు సెలవులు లేకపోవడం, ఓటింగ్‌ శాతం పెంచడంలో అధికారుల ప్రచార లోపం, పోలింగ్‌ బూత్‌ల వరకు ఓటర్లను రప్పించడంలో రాజకీయ పార్టీలు విఫలం అయ్యాయనే ఆరోపణలున్నాయి.సాధారణంగా ఎక్కడైనా ఉప ఎన్నికలో భారీగా పోలింగ్‌ శాతం నమోదు అవుతుంటుంది. కానీ జూబ్లీహిల్స్‌లో మాత్రం ఒక్క శాతమే ఓటింగ్‌ పెరగడంతో.. గెలుపు ఎవరిని వరిస్తుందా అనేది తెలియని పరిస్థితి. తామే గెలుస్తామంటూ కాంగ్రెస్‌ పార్టీ, కాదు కాదు తామే గెలుస్తామంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సర్వేలు అన్నీ తమ వైపే ఉన్నాయని కాంగ్రెస్‌ నేతలు చెబుతుండగా.. సైలెంట్‌ ఓటింగ్‌ జరిగిందని.. తద్వారా తమ విజయం ఖాయమని బీఆర్‌ఎస్‌ నేతలు అంటున్నారు. మొత్తంగా శుక్రవారం మధ్యాహ్నం తుది ఫలితం వెల్లడయ్యే వరకు ఉత్కంఠ తప్పని పరిస్థితి.జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం మొత్తం ఓటర్లు : 4,01,365 పురుషులు : 2,08,561 మహిళలు : 1,92,779 ఇతరులు : 25 పోలింగ్‌ శాతం : 48.49
ఓటుహక్కును సద్వినియోగం చేసుకున్నవారు : 1,94,631 పురుషులు : 99,771మహిళలు : 94,855 ఇతరులు : ..