జనం న్యూస్ :- సాధారణంగా లిక్కర్ బ్రాండ్లకు ఒకప్పుడు ప్రమోషన్ చేసేవారు. టీవీలు, పత్రికల్లో ప్రకటనలు ఇచ్చేవారు. తర్వాత కంపెనీలు మద్యంపై ప్రకటనలు ఇవ్వొద్దని కోర్టులు ఆదేశించడంతో ఇప్పుడు తమ బ్రాండ్‌ను ప్రమోట్ చేసుకోవడానికి సోడా, వాటర్ బాటిళ్లపై కంపెనీ పేరు ముద్రించి ప్రమోషన్ చేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఓ వైన్స్ యజమాని తన షాపు గురించి ప్రమోషన్ చేయించుకునేలా ఓ యాడ్ రూపొందించాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియా ప్రభావం..
సోషల్ మీడియా ప్రభావం ప్రస్తుత సమాజంపై తీవ్రంగా ఉంది. టాప్ పత్రికలో, టీవీలో ఇచ్చినా రాని పబ్లిసిటీ సోషల్ మీడియా ద్వారా వస్తోంది. అయితే వాస్తవికత మాత్రం సదేహాస్పదం. అయినా చాలా మంది ప్రమోషన్ల కోసం సోషల్ మీడియా(ఫేస్ బుక్, వాట్సాప్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ తదితరాలు) వాడుతున్నారు. హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, వస్త్ర దుకాణాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లతో సోషల్ మీడియాలోనే విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఆర్ఆర్ఆర్ వైన్స్ యాజమాన్యం.. తన షాపు గురించి వినూత్నంగా, విభిన్నంగా ప్రమోషన్ చేయించింది.
షాపులో సౌకర్యాలపై..
షాప్ పక్కన ఉన్న పర్మిట్ రూంలో ఉన్న వసతులు, సౌకర్యాలు, అక్కడ ఏర్పడే అనుబంధాలను ఈ ప్రమోషన్లో హైలెట్ చేశారు. ఓ వ్యక్తి మద్యం గ్లాసులో పోసుకుని, నీళ్లు మిక్స్ చేయాలని చూస్తాడు. కానీ అప్పటికే బాటిల్లో నీళ్లు అయిపోతాయి. ఇక మరో వ్యక్తి బీర్ తాగుతూ సిగరేట్ వెలిగించుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ తన వద్ద అగ్గిపెట్ట లేదా లైటర్ ఉండదు. దీంతో ఏం చేయాలని ఆలోచిస్తుండగా, దూరంలో మద్యం పోసుకుని నీళ్ల కోసం చూస్తున్న వ్యక్తి.. బీర్ తాగే యువకుడి చేతిలో వాటర్ బాటిల్ గమనిస్తాడు. అదే సమయంలో అతను సిగరేట్ వెలిగించుకునేందుకు లైటర్ కోసం చూస్తున్నట్లు గమనిస్తాడు. వెంటనే లైటర్ చూపిస్తూ సైగ చేస్తాడు.. గమనించిన బీర్ బాయ్ కూడా వాటర్ బాటిల్‌తో సైగ చేస్తాడు.. ఇద్దరూ ట్రిపుల్ ఆర్ తరహాలో పరిగెత్తుకుంటూ వెళ్లి షేక్‌హాండ్ ఇచ్చుకుంటారు. ఇంతలో వైన్‌షాప్ పేరు ఆర్ఆర్ఆర్ డిస్ప్లే అవుతుంది.
స్పందిస్తున్న నెటిజన్లు..
వినూత్నంగా ఉన్న ఈ ప్రమోషన్ వీడియో వేల వ్యూస్ సాధించింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఫైర్ అండ్ వాటర్ అని, సూపర్ అని కొందరు.. శంషాబాద్‌లో ఉంది ఆర్ఆర్ఆర్ వైన్స్ అని కొందరు కామెంట్ చేశారు. మరొకరు బీఆర్ తాగే వ్యక్తి వద్ద వాటర్ బాటిల్ ఎందుకు అని సందేహం వ్యక్తం చేశాడు.
ఏది ఏమైనా.. సరికొత్తగా ఆర్ఆర్ఆర్ వైన్స్ యజమాని ప్రమోషన్ యాడ్ చేయించడం ఆసక్తిగా మారింది. అయితే దీనికి చట్టపరంగా ఏమైనా అభ్యంతరాలు రాకుంటే.. మిగతా వారు కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంది.


