.జనం న్యూస్ నవంబర్ 19 కుకట్ పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
అమమ్యాలు అప్పజెప్పితే అన్ని సక్రమమే…. స్థానికులు ఫిర్యాదులు చేసిన మొద్దు నిద్రలో టౌన్ ప్లానింగ్ విభాగం….మూసాపేటలోనీ జెపి నగర్ లో అక్రమ నిర్మాణం జోలికి వెళ్ళని జిహెచ్ఎంసి అధికారులు….టౌన్ ప్లానింగ్ అధికారులపై ఏసీబీ తనిఖీలు చేయాలని స్థానికుల డిమాండ్…..కూకట్పల్లి సర్కిల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారుల కనసన్నల్లోని నిర్మాణాలు విచ్చలవిడిగా వెలుస్తున్న ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదు. జిహెచ్ఎంసి మూసాపేట్ సర్కిల్ 23 టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు పూర్తిగా అవినీతి ఊబిలో కూరుకుపోవడం దుమారం రేపుతోంది. సర్కిల్ పరిధిలోని అనేక ప్రాంతాల్లో ఎటు చూసిన బారీ ఎత్తున జరుగుతున్న అక్రమ కట్టడాలు దర్శనమిస్తున్నాయి. కొందరు టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతి, అక్రమాలు పరాకాష్టకు చేరాయి. అధికారులపై వస్తున్న అవినీతి ఆరోపణలకు అక్రమ కట్టడాలు సజీవ సాక్ష్యంగా మారాయి. అరకొర అనుమతులు తీసుకుని ఒక్కో నిర్మాణంపై అదనంగా మూడు నుండి నాలుగు అంతస్తులు నిర్మిస్తూ ప్రభుత్వ ఆదాయానికి నిర్మాణదారులు గండి కొడుతున్నారు. అక్రమ నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా అధికారులు వారి వద్ద నుంచి లక్షల రూపాయలు లంచాలు గుంజుతున్నట్లు సమాచారం. కూకట్ పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ్ చౌహన్ స్పందించక పోవడం అధికారుల అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సర్కిల్ 23 పరిధిలో సుమారు వంద కట్టడాలు చేపట్టగా ఆ నిర్మాణాలలో 70 శాతం నాలలు టీఎస్ బి పాస్ నిబంధనలను ఉల్లంఘించి జరుగుతున్నవే కావడం గమనార్హం. అడ్డగోలు నిర్మాణాలను అరికట్టవలసిన అధికారులే అండగా నిలవడం విడ్డూరం. మూసాపేట్ డివిజన్ పరిధిలో జె.పి. నగర్ లో ప్లాట్ నెంబర్ 46 లో 200 గజాల స్థలంలో స్టిల్ట్ ప్లస్ 2 వరకే అనుమతి తీసుకుని పర్మిట్ నెంబర్ (473523/0430/ జిహెచ్ఎంసి 2025) అదనంగా మరో నాలుగు అంతస్తులు నిర్మిస్తూ ప్రభుత్వ ఆదాయానికి పెద్ద మొత్తంలో గండి కొడుతూ అధికారుల జేబులు నింపుతుండడం తీవ్ర దుమారం రేపుతోంది. అక్రమ కట్టడాల బాగోతంపై ప్రశ్నించిన వారిని స్వయంగా టౌన్ ప్లానింగ్ అధికారులే బెదిరిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవలసిన అధికారులే వాటిని దగ్గరుండి ప్రోత్సహించడంపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బరితెగించి అవినీతికి పాల్పడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులపై ఏసీబీ తనిఖీలు నిర్వహించి అవినీతి అధికారుల భరతం పట్టాలని స్థానికులు కోరుతున్నారు. నెలనెలా ఒకటొ తేదీన ప్రజల పన్నులతో జీతాలు తీసుకుంటున్న ఉద్యోగులు వారి అక్రమ సంపాదన కోసం పన్నులు కట్టే ప్రజల కోసం పని చేయకుండా స్వలాభం కోసం అడ్డదారులు తొక్కుతుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ నిర్మాణదారులకు మద్దతుగా నిలుస్తూ చట్టాలను లెక్కచేయకుండా ఇస్టారీతి న వ్యవహరిస్తున్న మూసాపేట్ టౌన్ ప్లానింగ్ అధికారులపై విజిలెన్స్ ఎంక్వయిరీ జరిపించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జె.పి.నగర్ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ప్లాట్ నెంబర్ 46 లో నిర్మిస్తున్న అక్రమ కట్టడాన్ని వెంటనే సీజ్ చేసి అక్రమ నిర్మాణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్థానికులు జోనల్ కమిషనర్ ను కోరుతున్నారు.



