జనంన్యూస్. 18.నిజామాబాదు.
విద్యా శాఖ పనితీరుపై సుదీర్ఘ సమీక్ష..
పదవ తరగతి వార్షిక ఫలితాలలో ఉత్తీర్ణత మరింతగా మెరుగుపడేలా అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా విద్యా శాఖ పనితీరుపై ఎం.ఈ.ఓలు, కాంప్లెక్స్ హెచ్.ఎంలతో కలెక్టర్ మంగళవారం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఒక్కో కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల వారీగా నిర్వహణ తీరు, ఆయా బడులలో నెలకొని ఉన్న స్థితిగతులు, కొనసాగుతున్న బోధన తీరు, అవసరమైన సదుపాయాల కల్పన తదితర అంశాల గురించి చర్చిస్తూ దిశానిర్దేశం చేశారు. ఎం.ఈ.ఓ, కాంప్లెక్స్ హెచ్.ఎం, ఏ.ఈలతో కూడిన కమిటీలు పాఠశాలను సందర్శించి, సమగ్ర వివరాలతో రూపొందించిన నివేదికలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ వీక్షిస్తూ, సమస్యల పరిష్కారం విషయమై సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పదవ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు నమోదు అయ్యేలా ప్రతి పాఠశాలలో ప్రణాళికాబద్దంగా విద్యను బోధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయా సబ్జెక్టులలో వెనుకబడి ఉన్న విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని అన్నారు. పాఠశాలలకు విద్యార్థిని, విద్యార్థులు అందరూ క్రమం తప్పకుండా హాజరు అయ్యేలా పర్యవేక్షణ జరపాలని, ఒకవేళ ఎవరైనా గైర్హాజరు అయితే, అదే రోజు సాయంత్రం లోపు వారి తల్లిదండ్రులకు సమాచారం అందించి పిల్లలను రెగ్యులర్ గా బడికి పంపాల్సిందిగా కోరాలన్నారు. వయోజన విద్య విషయంలోనూ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, జిల్లాలో 59వేల మంది వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు వీలుగా 5900 మంది విద్యా వాలంటీర్లకు శిక్షణ అందించడం జరుగుతోందన్నారు. ఒక్కో వాలంటీర్ 10 మందికి విద్యను నేర్పిస్తారని అన్నారు. కాగా, పాఠశాలల్లో నిరుపయోగంగా ఉన్న స్క్రాప్ ను నిబంధనలు పాటిస్తూ డిస్పోజ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అవసరమైన చోట ఫర్నీచర్ మరమ్మతులు చేయించాలని, ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు, విద్యుత్, నీటి వసతి వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండాలన్నారు. పెండింగ్లో ఉన్న సివిల్ వర్క్స్ ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలని, ఇంటర్నెట్ సదుపాయం సమకూర్చుకోవాలని సూచించారు. తగిన పుస్తకాలతో లైబ్రరీ, రీడింగ్ కార్నర్ లు ప్రతి బడిలో ఉండాలని, విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. మద్యాహ్న భోజనం నిర్వహణలో లోటుపాట్లకు తావులేకుండా, మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని, భోజన ఏజెన్సీల నిర్వాహకులకు తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు జరిపించాలన్నారు. మద్యాహ్న భోజనం సరుకులు, ఆహార పదార్థాల నాణ్యతను ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులతో తనిఖీలు చేయించాలని సూచించారు. ప్రతి బడిలో కిచెన్ గార్డెన్ల నిర్వహణ సమర్ధవంతంగా జరగాలని అన్నారు. శత శాతం ముఖ గుర్తింపు విధానం(ఎఫ్.ఆర్.ఎస్) ద్వారానే ఉపాద్యాయులు, విద్యార్థులు హాజరు నమోదు జరగాలని, ఆధార్ కార్డు లేని విద్యార్థులను గుర్తించి వారికి బర్త్ సర్టిఫికెట్లు ఇప్పించి, ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేయించాలని, ప్రతి విద్యార్థికి సంబంధించిన అపార్ జెనరేట్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎం.ఈ.ఓలు, కాంప్లెక్స్ హెచ్.ఎంలు క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తూ, పాఠశాలల నిర్వహణ మెరుగుపడేలా చొరవ చూపాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, జిల్లా విద్యా శాఖ అధికారి పి.అశోక్ తదితరులు పాల్గొన్నారు.


