(జనం న్యూస్ 19 ప్రతినిధి కాసిపేట రవి )
భీమారంమండలంలోని నర్సింగాపూర్, పరిసర గ్రామాల్లో పందుల సంచారం రోజురోజుకు పెరుగుతోంది. రాత్రివేళ పొలాల్లోకి చేరిన పందులు పంటలను ధ్వంసం చేస్తుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటలకు భారీ నష్టం కలుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కష్టపడి వేసిన పంటను కొద్ది రోజుల వ్యవధిలోనే పందులు నాశనం చేస్తున్నాయని రైతులు మండిపడుతున్నారు. పలుమార్లు గ్రామ పెద్దలు, రైతులు అడవి శాఖ అధికారులకు సమస్య గురించి తెలియజేసినా ఇప్పటివరకు ప్రభావవంతమైన చర్యలు కనిపించలేదని రైతులు విమర్శిస్తున్నారు.పందుల వల్ల రాత్రివేళ పొలాల్లో కాపలాలు కాయాల్సి రావడం, మహిళలు, వృద్ధులు భయాందోళనకు గురవడం వంటి సమస్యలు పెరుగుతున్నాయని రైతులు చెబుతున్నారు. పందులను అదుపులోకి తెచ్చేలా వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.



