జనం న్యూస్ 22 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐ.పి.ఎస్. ఆదేశాలమేరకు నవంబరు 21న విజయనగరం పట్టణంలో గల ఎస్.ఎస్.ఎస్.ఎస్ జూనియర్ కళాశాల విద్యార్థులకు శక్తీ యాప్, ఈవ్ టీజింగ్, డిజిటల్ అరెస్టు, రహదారి భద్రతా నియమాలు, గంజాయి, సైబర్ నేరాలపై మహిళాపోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇ.నరసింహ మూర్తి మరియు ఎస్ఐ శిరీష అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా మహిళా పిఎన్ సిఐ ఇ.నర్సింహమూర్తి మాట్లాడుతూ – విద్యార్థినులకు (ఎస్.ఓ.ఎస్) మొబైల్ యాప్ ఏ విధంగా డౌన్లోడ్ చేయడం, దాని పని తీరును గురించి క్షుణ్ణంగా వివరించారు. మహిళల మొబైల్ ఫోనులో శక్తి యాప్ నిక్షిప్తమై ఉంటే ఆపద సమయాల్లో రక్షణగా ఉంటుందని, ఒక కుటుంబ సభ్యుడు మీకు తోడు ఉన్న ట్లేనన్నారు. ఆపద సమయాల్లో శక్తి యాప్ లోని ఎస్.ఓ.ఎస్. బటన్ను ప్రెస్ చేసినట్లయితే క్షణాల్లో పోలీసు బృందం మీరున్న ప్రాంతానికి చేరుకొని, రక్షణగా నిలుస్తారన్నారు. మహిళల భద్రతకు ఈ యాప్లో సేఫ్ ట్రావెల్ ఆప్షన్ ఉందని, మహిళలు ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తుల వాహనాలు, ఆటోల్లో ప్రయాణించినపుడు సేఫ్ ట్రావెల్ ఆప్షన్పై క్లిక్ చేసి, చేరుకోవాల్సిన ప్రాంతాన్ని నమోదు చేస్తే, వారు సురక్షితంగా గమ్య స్థానానికి చేరుకొనేంత వరకు వారి ప్రయాణంపై పోలీసులు నిఘా పెడతారన్నారు. విద్యార్థులు లక్ష్యంపై దృష్టి పెట్టుకొని, చదువుకోవాలని ఇతరులపట్ల ఆకర్షితులు కావద్దని, వారు చెప్పే మాయమాటలు నమ్మి, జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. పోక్సోచట్టం, ఈవ్ టీజింగ్ కు పాల్పడిన కేసుల్లో శిక్షలు గురించి వివరించి అవగాహన కల్పించారు. విద్యార్థులు ఎటువంటి ప్రలోభాలకు, ఆకర్షణలకు లోనుకావద్దన్నారు. రహదారి భద్రతా నియమాలు సైబరు నేరాలు, డిజిటల్ అరెస్టులు పట్ల అవగాహన కలిగి ఉండాలని, సైబరు నేరగాళ్ల ఉచ్చులో పడకుండా జాగ్రత పడాలన్నారు. విద్యార్థులు గంజాయి, ఇతర మత్తు, మాదక ద్రవ్యాలకు బానిసలు కావద్దని, జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. గంజాయి గురించి సమాచారం ఏదైనా తెలిస్తే స్థానిక పోలీసు స్టేషన్కు లేదా డయల్ 100/112 కు లేదా 1972 కు గాని వెంటనే తెలియజేయాలని విద్యార్థులను సిఐ ఇ.నర్సింహమూర్తి కోరారు.
ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇ.నరసింహ మూర్తి, ఎస్ఐ శిరీష, శక్తీ బృందం సిబ్బంది మరియు కళాశాల యాజమాన్యం పాల్గొన్నారు.


