“మాదకద్రవ్యాలు వద్దు – గంజాయి అక్రమ రవాణాను నిరోధిద్దాం”
మత్తు పదార్ధాలకు “నో” చెప్పండి – మంచి జీవనానికి “అవునని” చెప్పండి.
గంజాయి మరియు మాదకద్రవ్యాల నిర్మూలనపై విజయనగరం జిల్లా పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు.
జనం న్యూస్ 22 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా విశాఖపట్నం రేంజ్ పరిధిలో ప్రారంభించిన “అభ్యుదయం సైకిల్ యాత్ర” విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాధ్ జట్టీ ఐ.పి.ఎస్ ఆదేశాలతో, విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ ఉత్తర్వుల మేరకు ఈ రోజు విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో విశేష స్పందనతో కొనసాగింది. ఈ కార్యక్రమంలో మొదటగా కొత్తవలసలో నాలుగు రోడ్డుల జంక్షన్ లో డ్రగ్స్ పై అవగాహన సభ పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సభలో విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు, కొత్తవలస సిఐ సి.హెచ్.షణ్ముఖ రావు, కొత్తవలస పరిధిలో ఉండే డిఫెన్సు అకాడమీ డిరెక్టర్లు వివిధ ప్రైవేటు మరియు గవర్నమెంటు పాఠశాలల ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, విద్యార్ధులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు మాటలాడుతూ – ఈ అభ్యుదయం సైకిల్ యాత్రను విశాఖపట్నం రేంజ్ డిఐజి శ్రీ గోపీనాథ్ జట్టి, ఐపిఎస్ సమాజంలో మార్పు కోసం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారని తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా విశాఖపట్నం రేంజ్ పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారన్నారు. దేశానికి యువతే వెన్నుముక్క అని అలాంటి యువత మత్తు పదార్ధాలకు బానిసలు కాకూడదని తెలిపారు. మాదకద్రవ్యాల బారిన పడినవారిని శిక్షించడం మాత్రమే సరిపోదని, వారిని తిరిగి సమాజంలో నిలబెట్టేందుకు పునరావాస చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. యువత భవిష్యత్తును రక్షిస్తూ డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించుటలో అందరు తమవంతు బాధ్యతగా ముందుగు రావాలని పిలుపునిచ్చారు. గంజాయి అమ్మినా, కలిగివున్న, తరలించినా నేరమేనని తెలిపారు. ప్రజలు గంజాయి మరియు ఇతర అసాంఘిక కార్యక్రమాల గురించి సమాచారం తెలిస్తే వెంటనే 1972కు, 100/112కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరితో విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు డ్రగ్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు.తదుపరి అభ్యుదయం సైకిల్ ర్యాలీ కొత్తవలస నుండి నిమ్మలపాలెం వైపు కొనసాగింది. ఎల్.కోట మండలంలోకి ప్రవేశించిన అభ్యుదయం సైకిల్ ర్యాలీను విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు మరియు ఎస్.కోట రూరల్ సిఐ ఎల్.అప్పలనాయుడు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎ.పి. మోడల్ పాఠశాలలో విద్యార్ధులు, ఉపాధ్యాయులతో మత్తు పదార్ధాల వలన కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించి, వారితో డ్రగ్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. తీన్మార్, కోలాటం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం సైకిల్ ర్యాలి ఎస్.కోట మండలం పరిధిలోకి ప్రవేశించగా అక్కడ వారికి ఎస్.కోట పోలీస్ స్టేషన్ సిఐ వి.యెన్. మూర్తి ఘనంగా స్వాగతించారు. వెంకటరమణపేట వద్ద 100 మంది స్టూడెంట్స్ సైకిల్స్ తో ర్యాలీ స్వాగతం పలికి ఎస్ కోట వివేకానంద కాలేజీ వరకు సైకిల్ మరియు కాలేజీ అమ్మాయిలతో ఫుట్ ర్యాలీ నిర్వహించి కాలేజీలో స్కూల్ స్టూడెంట్స్ మరియు కాలేజీ పిల్లలకు మాదకద్రవ్య దుర్వినియోగం మీద అవగాహన కల్పించారు. తదుపరి రేపు ఎస్.కోట నుండి అభ్యుదయం సైకిల్ ర్యాలీ ప్రారంభం కానున్దన్నారు.ఈ రోజు ఈ కార్యక్రమంలో విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు, కొత్తవలస సిఐ సి.హెచ్.షణ్ముఖ రావు, ఎస్.కోట రూరల్ సిఐ ఎల్.అప్పలనాయుడు, ఎస్.కోట పోలీస్ స్టేషన్ సిఐ వి.యెన్. మూర్తి, ఎల్.కోట ఎస్ఐ నవీన్ పడాల్, పోలీస్ మరియు ఈగల్ సిబ్బంది, వివిధ ప్రైవేటు మరియు గవర్నమెంటు పాఠశాలల ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, విద్యార్ధులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాధ్ జట్టీ ఐ.పి.ఎస్ సందేశం -మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును దెబ్బతీస్తుందని, అక్రమంగా గంజాయి రవాణా మరియు విక్రయం నేర ప్రపంచాన్ని పెంపొందిస్తుందని తెలిపారు. నల్లదందా ద్వారా వచ్చే డబ్బు, యువతను నేరాలకు నెట్టడంతో పాటు, సమాజాన్ని అస్థిరం చేసే ప్రమాదకర శక్తులకు బలం చేకూరుస్తుందని ఆయన పేర్కొన్నారు.గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల బెడదను పూర్తిగా నిర్మూలించేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారని, సరిహద్దు మార్గాలను పూర్తిగా పర్యవేక్షిస్తూ, రవాణాలో భాగమైన వారికి ఎటువంటి ఉపశమనం లేకుండా చట్టపరమైన శిక్షలు అమలు చేస్తున్నామని అన్నారు. తద్వారా నేరస్థులు ఏ రూపంలోనైనా తప్పించుకోలేని విధంగా కట్టుదిట్టమైన చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.“ప్రతి కుటుంబం – ప్రతి గ్రామం – ప్రతి నగరం మాదకద్రవ్య రహితంగా ఉండాలి. యువత మన దేశం భవిష్యత్తు. వారి చేతుల్లో పుస్తకాలు ఉండాలి కానీ మాదకద్రవ్యాలు కాదు. గంజాయి మాఫియాలను పూడ్చిపెట్టడానికి పోలీసులకు ప్రజల సహకారం అత్యంత అవసరం.అనుమానాస్పదమైన వ్యక్తులు లేదా కార్యకలాపాలు గమనిస్తే తక్షణమే — డయల్ 112 డయల్ 100 1972 (టోల్ ఫ్రీ) లేదా స్థానిక పోలీసులు సంప్రదించాలని కోరారు . యువతకు సరికొత్త అవకాశాల మార్గం చూపాలి.”ఆయన ఇంకా, ప్రభుత్వ పథకాలు, పాఠశాలలలో అవగాహన కార్యక్రమాలు, మరియు యువతకు క్రీడలు – నైపుణ్యాలు – విద్యపై దృష్టిర్పెట్టే కార్యక్రమాలు విస్తృతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. పోలీసులు కేవలం చట్ట అమలులోనే కాదు, యువతను సరైన దారి పట్టించే సామాజిక బాధ్యతలో కూడా ముందుంటారని అన్నారు.మాదకద్రవ్యాల వ్యతిరేక పోరాటంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని, “మాదకద్రవ్యాలకు వద్దు – గంజాయి అక్రమ రవాణాను నిరోధిద్దాం” అనే సంకల్పంతో ముందుకు సాగుదాం అని పిలుపునిచ్చారు.


