Listen to this article

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 22 – 11- 2025

తెలంగాణ రాష్ట్రంలో నియంత్రణ లేకుండా మద్యం విచ్చలవిడిగా విక్రయం కొనసాగుతుండటంపై తీవ్రమైన ఆందోళన వ్యక్తమైంది.

మద్యం ప్రభావంతో పేద ప్రజలు ఆరోగ్యపరంగా దెబ్బతింటూ, చిన్న వయసులోనే లివర్ దెబ్బతిని 40 ఏళ్లకే మరణాలు పెరుగుతున్నాయని, లక్షలాది కుటుంబాలు రోడ్డుపై పడుతున్నాయంటే అది ప్రభుత్వం తక్షణమే పరిగణలోకి తీసుకోవాల్సిన అత్యవసర సమస్య అని సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్ తీవ్రంగా హెచ్చరించారు.బాలరాజ్ మాట్లాడుతూ “తెలంగాణ రాష్ట్రంలో నియంత్రణ లేకుండా సాగుతున్న మద్యం విక్రయాలు పేద ప్రజల్ని పూర్తిగా దెబ్బతీస్తున్నాయి. గ్రామాల్లో, పట్టణాల్లో మద్యం అలవాటు కుటుంబాలను నాశనం చేస్తోంది. రోజువారీ కూలీలు, చిన్న ఉద్యోగులు సంపాదించిన డబ్బంతా మద్యం కోసం ఖర్చు చేస్తే ఇంట్లో పిల్లలు ఆకలితో అలమటించే పరిస్థితి వచ్చింది. మహిళలు కష్టపడుతూ కుటుంబాన్ని నెట్టుకురావడానికి పోరాడుతున్నారు. అయినప్పటికీ మద్యం మాఫియాల దందాను ప్రభుత్వాలు కట్టడి చేయడం లేదు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.అతను ఇంకా పేర్కొంటూ “ప్రతి రోజు ఆసుపత్రుల్లో లివర్ సమస్యలతో బాధపడుతూ పడకలపై ప్రాణాలు కోల్పోతున్న వారు ఎక్కువగా మద్యం వ్యసనం వల్లనే. 40 ఏళ్లు నిండక ముందే కుటుంబానికి పోషకుడైన వ్యక్తి మద్యం బారిన పడి మరణిస్తాడు. ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. చిన్న పిల్లలు చదువు మానేసి చిన్నచిన్న పనులు చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఇటువంటి ఘోర పరిస్థితిని నివారించాలంటే ప్రభుత్వం ఇక ఆలస్యం చేయకుండా మద్యం విక్రయాలపై కఠిన నిర్ణయం తీసుకోవాలి” అని స్పష్టంగా చెప్పారు.బాలరాజ్ డిమాండ్ చేస్తూ “మద్యం వల్ల ఎన్నో కుటుంబాలు చీలిపోయాయి. వేలాది మంది మహిళలు ఎవరి బాధ చెప్పుకుంటారు? ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యం, కుటుంబాల భవిష్యత్తు గురించి ఆలోచిస్తే మద్యం నిషేధంపై వెంటనే చర్యలు చేపట్టాలి. ప్రజలకు అవగాహన కల్పించాలి. గ్రామాల్లో మద్యం దుకాణాలు తగ్గించాలి. ప్రభుత్వ ఆదాయంపై కాకుండా ప్రజల ఆరోగ్యం, జీవితం ముఖ్యం” అని పిలుపునిచ్చారు.మద్యం ప్రభావంతో తెలంగాణలో పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు, ఆర్థిక కష్టాలు, కుటుంబాల విరిగిపోవడం—ఆల్ ఇవీ రాష్ట్రానికి పెద్ద సామాజిక ప్రమాదంగా మారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దీన్ని అత్యవసర అంశంగా పరిగణించి మద్యం నియంత్రణ, దుకాణాల తగ్గింపు, అవసరమైతే సంపూర్ణ నిషేధం పై త్వరిత నిర్ణయం తీసుకోవాలని చిట్టెంపల్లి బాలరాజ్ రైతు సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు డిమాండ్ చేశారు.