జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 26
తర్లుపాడు: మండల కేంద్రం నుండి మార్కాపురం పట్టణానికి వెళ్లే ప్రధాన రహదారిపై ప్రయాణికులకు రాకపోకలు కష్టతరంగా మారిన తరుణంలో, తర్లుపాడు గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు, సామాజిక సేవా వ్యక్తి కశెట్టి జగన్ మంచి మనసు చాటుకున్నారు. రహదారికి ఇరువైపులా చిల్ల చెట్లు పెరిగిపోవడం వల్ల వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ అడ్డంకుల వల్ల ప్రమాదాలు సైతం జరుగుతున్నాయని గుర్తించిన జగన్, వెంటనే సమస్య పరిష్కారానికి నడుం కట్టారు.తన జన్మదినాన్ని పురస్కరించుకుని, బుధవారం నాడు ఎటువంటి ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా, సొంత ఖర్చులతో రోడ్డుకు అడ్డుగా పెరిగిన చిల్ల చెట్లను తొలగించే కార్యక్రమాన్ని కశెట్టి జగన్ చేపట్టారు. రహదారిపై ఉన్న చెట్లను పూర్తిగా తొలగించడంతో, వాహనదారులకు రోడ్డు స్పష్టంగా, విశాలంగా కనిపించింది.చిల్ల చెట్లు తొలగించడంతో ఇకపై ప్రమాదాలు జరిగే అవకాశం తగ్గుతుందని ప్రజలు భావిస్తున్నారు.కశెట్టి జగన్ కేవలం ఉపాధ్యాయుడిగా మాత్రమే కాకుండా, అనేక సామాజిక సేవా కార్యక్రమాలలో తనదైన శైలిలో పాల్గొంటూ ప్రజల మన్ననలు పొందుతున్నారు.చెట్లను తొలగించడం ద్వారా ప్రధాన రహదారిని సురక్షితంగా మార్చినందుకు ప్రజలు, ముఖ్యంగా నిత్యం ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, కశెట్టి జగన్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆయన చేపట్టిన ఈ మంచి పని ఇతరులకు ఆదర్శప్రాయమని స్థానికులు కొనియాడారు.



