జనం న్యూస్ డిసెంబర్ 02 సంతబొమ్మాళి
మండలం:తాళ్లవలస గ్రామంలో డయేరియా కేసులు నమోదైన నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం గ్రామాన్ని సందర్శించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, వైద్య–ఆరోగ్య శాఖ, ఆర్‌డబ్ల్యూఎస్ తదితర విభాగాల ఉన్నతాధికారులు ఈ పర్యటనలో పాల్గొన్నారు.గ్రామంలో ఇంటింటికీ వెళ్లి అతిసార బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి అచ్చెన్నాయుడు వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. అత్యవసర వైద్య సేవలు, మందుల పంపిణీ, శుద్ధి చేసిన త్రాగునీటి సరఫరా వంటి చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.గ్రామంలోని ప్రతి ఇంట్లో వైద్య పరీక్షలు నిర్వహించాలి, ప్రజల ఆరోగ్య పరిస్థితిపై రోజువారీగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. తాళ్లవలసలోని త్రాగునీటి నమూనాలను సేకరించి వెంటనే పరీక్షించాలి, సమస్యలు ఉంటే తక్షణమే ప్రత్యామ్నాయ నీటి సదుపాయాలు కల్పించాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు.గ్రామంలోని ప్రతి కుటుంబం సురక్షితంగా ఉండే వరకు ప్రభుత్వం అందుబాటులో ఉంటుంది. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని అన్నారు.


