మైక్రో అబ్జర్వర్ల శిక్షణ తరగతుల్లో అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్
ఎన్నికల్లో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమైనది…….జనరల్ అబ్జర్వర్ కార్తీక్ రెడ్డి
జనం న్యూస్ సంగారెడ్డి, డిసెంబర్ 09 :
ఎన్నికలలో కీలకమైన ఓటింగ్ ప్రక్రియకు సంబంధించిన ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలన జరపాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మైక్రో అబ్జర్వర్లకు సూచించారు. ఎన్నికల సంఘం నిబంధనలు తు.చ తప్పకుండా అమలయ్యేలా ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికల ప్రక్రియ జరిగేలా సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని హితవు పలికారు. గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను సూక్ష్మ స్థాయిలో పరిశీలన జరిపేందుకు వీలుగా నియమించబడిన మైక్రో అబ్జర్వర్లకు మంగళవారం కలెక్టెట్ లోని గ్రీవెన్స్ హాల్లో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు కార్తీక్ రెడ్డి శిక్షణ కార్యక్రమానికి విచ్చేసి మైక్రో అబ్జర్వర్లకు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, సూక్ష్మ పరిశీలకుల ర్యాండమైజేషన్ ప్రక్రియను అనుసరిస్తూ మైక్రో అబ్జర్వర్లకు ఆయా ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలలో పరిశీలన బాధ్యతలు కేటాయించడం జరుగుతుందన్నారు. మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ కు సంబంధించిన ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహన ఏర్పర్చుకోవాలని, అప్పుడే పోలింగ్ తీరుతెన్నులను నిశితంగా పరిశీలించగల్గుతారని అన్నారు. ముఖ్యంగా పోలింగ్ కు ముందు రోజు ఉదయం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కు చేరుకొని పోలింగ్ సిబ్బందికి అందించే సామాగ్రి సక్రమంగా అందినదా లేదా అన్నది పరిశీలించాలని,పిమ్మట పోలింగ్ సిబ్బందితో కలిసి పోలింగ్ స్టేషన్లకు చేరుకోవాలని సూచించారు. పోలింగ్ ప్రక్రియ నిబంధనలకుఅనుగుణంగా, పూర్తి పారదర్శకంగా జరుగుతోందా లేదా అన్నది నిశిత పరిశీలన చేయాలని, గమనించిన అంశాలను జనరల్ అబ్జర్వర్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్, ఇతర అధికారులు నిర్వర్తిసున్న విధులను గమనించాలని, పోలింగ్ ప్రారంభమైనప్పటి నుండి పూర్తయ్యేంత వరకు అన్ని అంశాలను గమనిస్తూ, ఎప్పటికప్పుడు వాటిని జనరల్ అబ్జర్వర్ దృష్టికి తీసుకెళ్లాలని, ఓటింగ్ గోప్యతను కాపాడే విధంగా మైకో అబ్జర్వర్లు బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు. సమస్యాత్మక కేంద్రాలలో మరింత ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, పోలింగ్ కేంద్రం బయట, పరిసర ప్రాంతాల్లోనూ జరిగే అంశాలను గమనిస్తూ జాగరూకతతో వ్యవహరించాలని అన్నారు.ఎన్నికల సాధారణ అబ్జర్వర్ కార్తిక్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికలలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమైనదని, మైక్రో అబ్జర్వర్స్ నిబద్ధతతో అంకితభావంతో పనిచేయాలన్నారు. ఎన్నికల సంఘం గుర్తింపు కార్డులు కలిగిన వారు, ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న వారు మినహా, ఇతరులెవరిని పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లేందుకు అనుమతి లేదన్నారు.అన్ని అంశాలను పూర్తిగా ఆకళింపు చేసుకుని తదనుగుణంగా విధులు నిర్వహించాలని మైక్రో అబ్జర్వర్లకు సూచించారు.శిక్షణ తరగతుల్లో జడ్పీ సీఈవో ఇన్చార్జి డిపిఓ జానకి రెడ్డి,శిక్షణ తరగతుల నోడల్ అధికారి మరియు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామాచారి, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ , మాస్టర్ ట్రైనర్, మైక్రో అబ్జర్వర్లు, పాల్గొన్నారు.


