జనం న్యూస్ 20 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం జిల్లాలో జీఎస్టీ 2.0 సంస్కరణలు కాగితాలకే పరిమితమయ్యాయి. నిబంధనలు అమలు చేయడంలో అధికారులు విఫలం కావడంతో వ్యాపారులు సామాన్యులను యధేచ్ఛగా నిలువు దోపిడీ చేస్తున్నారు.సెప్టెంబర్ 22 నుండి అమలులోకి వచ్చిన సవరించిన జీఎస్టీ స్లాబులు, తగ్గించిన ధరలు జిల్లాలో ఎక్కడా అమలు కావడం లేదు.మందుల షాపుల దందా: మందులను 5 శాతం స్లాబులోకి తెచ్చినప్పటికీ, మెడికల్ షాపుల్లో పాత ధరలకే విక్రయిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రశ్నించిన వారిపై వెటకారంగా సమాధానం ఇస్తున్నారు.అక్రమాలను అరికట్టాల్సిన జీఎస్టీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అంతా బాగుందని ప్రకటనలు ఇస్తూ బాధ్యతారాహిత్యాన్ని చాటుకుంటున్నారు.
గ్రామీణ ప్రాంత ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారులు పాత ధరలకే విక్రయాలు సాగిస్తున్నారు. దుకాణాల వద్ద రేట్ల పట్టికలు ప్రదర్శించాలన్న ఆదేశాలను ఎవరూ పాటించడం లేదు.’సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్’ అంటూ ప్రచారం చేసుకున్న ప్రభుత్వాలు, ఆ సంస్కరణల ఫలాలు సామాన్యులకు అందేలా చూడటంలో విఫలమయ్యాయి.


